కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలో గంజాయి చాక్లెట్లు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. వరంగల్ ఎంజీఎం సెంటర్లో తనిఖీలు చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా మాలిక్ కాన్పాడాకు చెందిన జనార్ధన్ వద్ద గంజాయి చాక్లెట్లు దొరికినట్లు చెప్పారు. వాటిని సోలాపూర్‌లో ఎక్కువ ధరకు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద 72 గంజాయి చాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లునాగరాజు, సత్యనారాయణ, రవిని ఆయన అభినందించారు.
ఏడు మోరీల వద్ద 12 కేజీల గంజాయి..
సిటీలోని హంటర్ రోడ్‌లోని ఏడు మోరీల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇద్దరు మహిళల వద్ద 12 కేజీల గంజాయి పట్టుబడినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన త్రివేణి రామనాథ్ ఘెడ్కే, అంజలి రామ్సాథే పూణేకు 12 కేజీల గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
