
భైంసా, వెలుగు : పట్టణ ప్రగతి వచ్చాక మున్సిపాలిటీల్లో నిధులకు కొరత లేదని ఓ వైపు మంత్రి కేటీఆర్ చెప్తుండగా నిర్మల్ జిల్లా భైంసాలో ట్రాక్టర్లలో డీజిల్‌కు పైసల్లేక చెత్త సేకరణ వాహనాలన్నీ మున్సిపాలిటీకే పరిమితమయ్యాయి. స్థానిక పెట్రోల్‌బంక్‌కు ఐదు నెలలుగా రూ.18 లక్షలకు పైగా బకాయి ఉండడం, ఎంతకీ చెల్లించకపోవడంతో బంక్ యాజమాని డీజిల్ పోసేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో మూడు రోజులుగా ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు, ఇతర వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో భైంసాలో చెత్త పేరుకుపోయి కాలనీలన్నీ కంపుకొడ్తున్నాయి. సర్కారు నుంచి ఫండ్స్ రాకపోవడంతో పైసల్లేక వాహనాలకు ఆయిల్మార్చక, ఇతర రిపేర్లు కూడా బంద్ పెట్టినట్లు తెలుస్తోంది.
పేరుకుపోయిన 98 టన్నుల చెత్త
భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులున్నాయి. ఈ ప్రాంతాల్లో చెత్త సేకరించడానికి17 మినీ ట్రాలీ ఆటోలు, ఐదు ట్రాక్టర్లు, మరికొన్ని వాహనాలున్నాయి. అన్ని వార్డులతో పాటు ప్రధాన రోడ్ల వెంట దుకాణాలు, హాస్సిటల్స్, ఇతర ప్రాంతాల నుంచి చెత్త సేకరిస్తూ ఉంటారు. పట్టణంలో ప్రతి రోజూ 24.7 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. కానీ, మూడు రోజులుగా చెత్త తీయకపోవడంతో సుమారు 98 టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. దీంతో దుర్వాసన వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం భైంసాలో వార సంత ఉండడంతో మరింత చెత్త పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.
ఖర్చు 35 లక్షలు.. వచ్చేది 22 లక్షలు
భైంసా మున్సిపాలిటీకి ప్రతినెలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.17 లక్షల వరకు వస్తాయి. ప్రజల నుంచి పన్నుల రూపంలో నెలకు రూ. 5 నుంచి 7 లక్షల వరకు వసూలవుతాయి. ఇందులో కరెంటు బిల్లులు సుమారు రూ. 18 లక్షలు, ఇతర ఖర్చులు రూ. 15 లక్షలు, సిబ్బంది జీతాలు అన్నీ కలిపితే మున్సిపాలిటీకి వచ్చే నిధులు సరిపోవడం లేదు. ప్రతి నెల లోటు బడ్జెట్ఉంటోంది. ఈ కారణంగా ఐదు నెలలుగా ట్రాక్టర్లలో డీజిల్ పోయిస్తున్నా డబ్బులు కట్టడం లేదు. ఇంతకాలం వేచి చూసినా బంక్ యజమాని చేసేదేం లేక డీజిల్పోయడం ఆపేశాడు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి కంపుకొడుతోంది.
వారం రోజులుగా చెత్తబండి వస్త లేదు
ప్రతి రోజు మా వార్డులో చెత్త తీసుకుపోవడానికి బండి వచ్చేది. కానీ వారం రోజులుగా వస్త లేదు. ఇంట్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతంది. బయట కూడా చెత్త కుప్పలు ఉండడంతో అక్కడ కూడా పడెయ్యడానికి వీలు లేకుండా పోయింది. దుర్వాసనతో ఉండనీకి అయితలేదు.
– శోభాబాయి, కిసాన్ గల్లీ
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
భైంసా మున్సిపాలిటీ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా. చెత్త సేకరించే వాహనాల డీజిల్ బకాయిలు రూ. 18లక్షలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్లాం. బంక్యాజమానితో మాట్లాడి బకాయిలు చెల్లించి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటాం.
- సంపత్ కుమార్, కమిషనర్
గబ్బు వాసన వస్తోంది
మా వార్డు అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. దీంతో ముక్కున వేలేసుకొని పోయే పరిస్థితి ఉంది. అడిగితే బండ్లకు డీజిల్ లేదని ఆపేసిన్రు అని చెప్తున్నరు. అవి ఎప్పుడొస్తయో..ఈ చెత్త బాధ ఎప్పుడు తప్పుతదో. – గంగుబాయి, బారిమమ్ గల్లీ