జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త ట్రాన్స్​ఫర్​స్టేషన్లు సరిపోవడం లేదు

జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త ట్రాన్స్​ఫర్​స్టేషన్లు సరిపోవడం లేదు

హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త ట్రాన్స్​ఫర్​స్టేషన్లు సరిపోవడం లేదు. కాలనీలకు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోల డ్రైవర్లకు సవాలుగా మారింది. పైగా ఒకేసారి ఆటోలు ట్రాన్స్​ఫర్​స్టేషన్ల వద్ద క్యూ కడుతుండడంతో అన్​లోడింగ్​కు టైమ్ పడుతోంది. దీంతో కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యం అవుతోంది. కేటాయించిన ఏరియాలను ఆటోల డ్రైవర్లు కవర్​చేయలేకపోతున్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో డ్రైవర్లు త్వరగా ట్రాన్స్​ ఫర్ స్టేషన్లకు చేరుకునేందుకు అవసరమైతే సర్కిల్ కి రెండు ట్రాన్స్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని మేయర్ విజయలక్ష్మి ప్రకటించి, ఆ అంశంపై దృష్టి పెట్టడంలేరు. స్వచ్ఛ ఆటోలు కొన్ని ఇండ్ల నుంచి చెత్తను సేకరించగానే ఆటో నిండిపోతుంది. ప్రస్తుతం గ్రేటర్​వ్యాప్తంగా 17 చెత్త ట్రాన్స్ ఫర్ స్టేషన్లు, 24 సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్​పోర్టు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వీటితోపాటు 72 రెఫ్యూజ్​కంపాక్టర్ వెహికల్స్ తో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్​యార్డుకు తరలిస్తున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ఉన్న ట్రాన్స్ ఫర్ స్టేషన్లపై లోడు పెరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భరించలేని కంపు కొడుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేషన్లు ఏర్పాటు చేసిన టైమ్​లో చుట్టూ ఇండ్లు లేవు. తర్వాత క్రమంగా నిర్మాణాలు పెరిగాయి. యూసఫ్​గూడ, లోయర్ ట్యాంక్ బండ్ లోని చెత్త ట్రాన్స్ స్టేషన్ల వద్ద ఇదే పరిస్థితి. చెత్త పేరుకుపోకుండా వెంటవెంటనే తరలించాలని, లేకుండా ట్రాన్స్ ఫర్ స్టేషన్​ను ఎత్తివేయాలని స్థానికులు జీహెచ్ఎంసీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. జియాగూడలో మెయిన్​రోడ్డుపైనే ట్రాన్స్​ఫర్ స్టేషన్ ఉంది. చెత్త పేరుకుపోయిన టైంలో రాకపోకలకు, స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. సిటీలోని మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. 

వెయ్యి ఆటోలు ఫీల్డులోకి రావట్లే

డస్ట్ బిన్ లెస్ సిటీగా మార్చామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ గొప్పులు చెబుతున్నప్పటికీ సిటీలో ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తోంది. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు 4,500 స్వచ్ఛ ఆటోలు ఉన్నప్పటికీ, దాదాపు వెయ్యి ఆటోలు ఫీల్డ్ లోకి రావడం లేదని తెలుస్తోంది. దీంతో జనం రోడ్లపైనే చెత్త పారబోస్తున్నారు. కొన్నిచోట్ల గతంలో డస్ట్​బిన్లు ఉండే చోట కుప్పగా పోస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ ఏరియాకు స్వచ్ఛ ఆటోలు రావడం లేదో కనీసం ఆరా తీయలేకపోతున్నారు. 

ఆరేళ్లలో రూ.535 కోట్లు ఖర్చు

ఇండ్లలోని చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు చేర్చేందుకు మాత్రమే బల్దియా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఆరేళ్లలో రూ.535 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2017కి ముందు రూ.137 కోట్లతో 2,500 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. 2020లో రూ.55 కోట్లతో 650 ఆటోలు, 2021లో  రూ.124 కోట్లతో 1,350 స్వచ్ఛ ఆటోలు తీసుకుంది. ఇవి కాకుండా సెకండరీ ట్రాన్స్ పోర్టు వెహికల్స్​ కోసం గత ఐదేళ్లలో రూ.218 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించింది. అలాగే డంపింగ్​యార్డుకి తరలించే వాహనాల ఖర్చు సపరేటుగా ఉంటోంది. ఎంత ఖర్చు చేసినా చెత్త సమస్య తీరడం లేదు.  

7 నెలలైనా కమిటీ వేయలే

గతేడాది సెప్టెంబర్ 20న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగులో అన్ని పార్టీల కార్పొరేటర్లతోపాటు మేయర్ విజయలక్ష్మి సైతం చెత్త తరలింపుపై సీరియస్ అయ్యారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇదే అంశంపై వచ్చే కౌన్సిల్ మీటింగ్ నాటికి అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి ఏం చేయాలనే దానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. చెప్పి 7 నెలలు అవుతున్నా ఇప్పటివరకు కమిటీ ప్రస్తావనే లేదు. డిసెంబర్ 24న జరిగిన బడ్జెట్ సమావేశంలోనూ ఈ విషయంపై చర్చించలేదు.