టాప్ 20 బిలీనియర్లలో తొలిసారి గౌతమ్ అదానీ

V6 Velugu Posted on Apr 07, 2021

  • 61.8 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద 
  • 12వ స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ

బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. ఫోర్బ్స్ బిలీనియర్ లిస్ట్  ప్రకారం ఈ ఏడాది మార్చి 5 నాటికి 50.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద, మంగళవారం నాటికి 61.8  బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 20 వ స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ బిలీనియర్ లిస్ట్–2021 లో 188.6 బిలియన్ డాలర్లతో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఉన్నారు. ఈయన సంపద 169.8 బిలియన్ డాలర్లుగా ఉంది. టాప్ 20 బిలినియర్ లిస్ట్లో ఇండియా నుంచి గౌతమ్ అదానీతో పాటు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ(12 వ ప్లేస్)  ఉన్నారు. ఈయన సంపద 76.8 బిలియన్ డాలర్లుగా ఉంది. టాప్ 10 లో ఉన్న అంబానీ, మంగళవారం నాటికి ఫోర్బ్స్ లిస్ట్–2021లో కిందకు పడ్డారు. 
100 బిలియన్ డాలర్లను దాటిన అదానీ గ్రూప్  
దేశంలో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ను దాటిన మూడో బిజినెస్ గ్రూప్గా అదానీ నిలిచింది. ఈ గ్రూప్కు చెందిన నాలుగు కంపెనీల షేర్లు మంగళవారం సెషన్లో ఆల్టైమ్ హైలను టచ్ చేశాయి. దీంతో అదానీ గ్రూప్కు చెందిన లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 106 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7.84  లక్షల కోట్లు) కు చేరుకుంది. అదానీ గ్రూప్కు చెందిన ఆరు కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. బీఎస్ఈ డేటా ప్రకారం వీటి మొత్తం మార్కెట్ క్యాప్ విలువ 106 బిలియన్ డాలర్లను దాటింది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు దక్కించుకుంటుండడంతో అదానీ కంపెనీల షేర్లు కొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. మంగళవారం సెషన్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రూ. 1,241 వద్ద ఆల్టైమ్ హైని తాకింది. అదానీ టోటల్ గ్యాస్  షేర్లు రూ 1,250 వద్ద,  అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు రూ. 1,145 వద్ద, అదానీ పోర్ట్స్ షేర్లు రూ. 853 వద్ద ఆల్టైమ్ హైని టచ్ చేశాయి. వీటితో పాటు అదానీ పవర్ 5 శాతం పెరిగి రూ. 98.40 కు, అదానీ గ్రీన్ ఎనర్జీ 3 శాతం లాభపడి రూ. 1,203 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు టాటా గ్రూప్,  రిలయన్స్  100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్లబ్ను దాటాయి. ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ. 242 బిలియన్ డాలర్లుగా, రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 171 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ కంపెనీలలో ఐదు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లకు పైనుండడం విశేషం.

ఎనలిస్టులు పట్టించుకోకపోయినా..
లిస్ట్యిన అదానీ కంపెనీలలో ఐదింటికి ఎనలిస్టుల కవరేజి లేకపోవడం గమనార్హం. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్లపై బ్రోకరేజి కంపెనీల నుంచి కవరేజ్ లేదు. ఒక్క అదానీ పోర్ట్స్ అండ్ సెజ్పై మాత్రం 21 ‘బై’ కాల్స్, 4 హోల్డ్ కాల్స్, ఒకటి సెల్ కాల్ ఉంది. గత ఏడాది అదానీ షేర్లు 800 శాతం వరకు పెరగడం విశేషం. ప్రస్తుతం అదానీ లిస్టెడ్ కంపెనీల వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉందని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినీత్ అన్నారు. వీటి ఫ్యూచర్ గ్రోత్ కంపెనీ షేర్ ధరలో కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ‘అదానీ గ్రూప్ షేర్లకు కవరేజీ ఇవ్వడం రిస్కీ. ఈ కంపెనీల అప్పులు చాలా ఎక్కువ. ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టారు. అందుకే చాలా మంది ఎనలిస్టులు ఈ కంపెనీలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు’ అని వినీత్ అభిప్రాయపడ్డారు. 

Tagged wealth, mukhesh ambani

More News