గౌతమ్ అదానీకి 3 రోజుల్లో రూ.66 వేల కోట్ల నష్టం

గౌతమ్ అదానీకి 3 రోజుల్లో రూ.66 వేల కోట్ల నష్టం


న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌‌‌లో ప్లేస్ సంపాదించిన అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ కేవలం మూడు రోజుల్లో తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన సంపద (దాదాపు రూ.66,675 కోట్లు) కోల్పోయారు. అదానీ గ్రూపునకుచెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ ఇన్వెస్టర్ల ఖాతాలను బ్లాక్ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదానీ ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా నష్టాలు చవిచూడటం ఇదే మొదటిసారి. తాజా నష్టాల వల్ల ఆయన సంపద తొమ్మిది బిలియన్ డాలర్లు తగ్గి 67.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ షేర్లు ఈ ఏడాది విపరీతంగా ర్యాలీ చేయడంతో అదానీ సంపద దాదాపు అంబానీ స్థాయికి చేరింది. అదానీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన మూడు మారిషస్ ఫండ్స్ అల్బులా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫండ్ అకౌంట్లను నేషనల్ షేర్ డిపాజిటరీ ఫ్రీజ్ చేసిందని నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో కంపెనీ షేర్లు విపరీతంగా నష్టపోయాయి. మారిషస్ కంపెనీల అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదని, ఈ విషయంలో వచ్చిన వార్తలన్నీ అబద్ధాలనీ అదానీ ప్రకటించినా, ఫలితం కనిపించడం లేదు. ఈ మారిషష్‌ కంపెనీల ‘అసెట్స్ అండర్ మేనేజ్‌‌‌‌మెంట్’లో 90 శాతం ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు అదానీ షేర్లలోనే ఉన్నాయి. ఈ విషయమై ముంబైకి చెందిన ఇండిపెండెంట్ రీసెర్చ్ ఎనలిస్ట్ హేమేంద్ర హజారీ మాట్లాడుతూ ఈ షేర్ల నిజమైన ఓనర్లు ఎవరనే విషయమై క్లారిటీ వస్తే తప్ప ఈ అయోమయం తొలగిపోదని స్పష్టం చేశారు. ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి అదానీ గ్రూప్ స్పోక్స్ పర్సన్ అంగీకరించలేదు. ఎక్సేంజీ ఫైలింగ్స్ ద్వారా అన్ని విషయాలూ తెలిపామని మాత్రమే అన్నారు. ఫారిన్ ఫండ్స్ గత పదేళ్ల నుంచి తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని అదానీ ఎక్సేంజీలకు ఈ నెల 14న తెలిపింది.  పుకార్లను పట్టించుకోవద్దని కోరింది. మారిషస్ కంపెనీల డీమాట్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిందీ లేనిదీ రిజిస్ట్రార్ అండ్‌  ట్రాన్స్‌‌‌‌ఫర్ ఏజెంట్‌‌‌‌కు అడిగామని అదానీ గ్రూప్ పేర్కొంది.

కొనసాగుతున్న షేర్ల పతనం..

 డీమాట్ అకౌంట్ ఫ్రీజ్ వార్తల వల్ల.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు ఈ వారంలో 7.7 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ నాలుగు రోజుల్లో 23 శాతం తగ్గింది. అదానీ పవర్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్ లిమిటెడ్ కనీసం 18 శాతం వరకు నష్టపోయాయి. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ షేర్లు దాదాపు 15 శాతం  పడిపోయాయి.  గత కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ పోర్ట్స్‌‌‌‌, గనులు, విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు గనుల వ్యాపారాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎన్‌‌‌‌డీయే ప్రభుత్వం ఇన్‌‌‌‌ఫ్రా డెవెలప్‌‌‌‌మెంట్ పై ఫోకస్ చేస్తుండటం కూడా అదానీ గ్రూపునకు కలసివచ్చింది.  అదానీ షేర్లు కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.  గత ఏడాది నుంచి ఈ షేర్లు 500 శాతానికిపైగా లాభపడ్డాయి. రెన్యువబుల్ ఎనర్జీ, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు,  రక్షణ కాంట్రాక్టు వంటి రంగాల్లోకి ఎంటరయిన అదానీ గ్రూప్ బిజినెస్‌‌‌‌లు భారీగా పెరుగుతాయనే అంచనాలే ఇందుకు కారణం.  ఈ నెల మొదట్లో అదానీ సంపద 80 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. ఈ ఏడాది మే నెలలో  మూడు అదానీ కంపెనీలు లిస్టింగ్‌‌‌‌కు వచ్చాయి. దీంతో మొత్తం లిస్టెట్ కంపెనీల సంఖ్య ఆరుకు చేరింది.దీంతో వీటి షేర్లకు గిరాకీ మరింత పెరిగిందని ఎనలిస్టులు చెప్పారు. అయితే ఫారిన్ ఫండ్స్ ఈక్విటీ ఎక్కువగా ఉండటం వల్ల, పబ్లిక్ షేర్లు చాలా తక్కువ కావడం వల్ల ఈ షేర్లు రిస్క్‌‌‌‌జోన్లో ఉన్నట్టేనని ఎనలిస్టులు పేర్కొన్నారు.