శరద్ పవార్‌తో గౌతమ్ అదానీ భేటీ..2 గంటలకు పైగా చర్చలు..!

శరద్ పవార్‌తో గౌతమ్ అదానీ భేటీ..2 గంటలకు పైగా చర్చలు..!

ముంబై : హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో బిలియనీర్‌ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని శరద్‌ పవార్‌ నివాసంలో గురువారం (ఏప్రిల్ 20న) పవార్ ను కలిసి  సుమారు రెండు గంటలపాటు అదానీ చర్చలు జరిపారని సమాచారం. 

అదానీ గ్రూప్‌లో ఆర్థిక అవకతవకలు, స్టాక్ మార్కెట్‌ మానిప్యులేషన్లను ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక దేశంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్‌ అదానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆయనకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.అదానీ గ్రూప్‌ ఆర్థిక అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన రిపోర్ట్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగకుండా ముగిశాయి.

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ను శరద్‌ పవార్‌ ఇటీవల తప్పుపట్టారు. పార్లమెంట్‌లో రాజకీయ బలం ఆధారంగా జేపీసీ ఏర్పడుతుందని తెలిపారు. దీంతో బీజేపీ సభ్యులే కమిటీలో ఎక్కువ మంది ఉంటారని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. దీనికి బదులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందంతో విచారణ జరిపిస్తే మంచిదని సూచించారు. అలాగే దేశంలోని ప్రతిపక్షాలు గతంలో టాటా, బిర్లా సంస్థలను టార్గెట్‌ చేసినట్లుగా ప్రస్తుతం అదానీ, రిలయన్స్‌ సంస్థలను కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకోవడం మంచిదికాదని హితవు పలికారు. హిండెన్‌బర్గ్‌ సంస్థపైనా మండిపడ్డారు. అయితే.. ప్రతిపక్షాల ఐక్యత కోసం అదానీ గ్రూప్‌పై జేపీసీ డిమాండ్‌ను తాను వ్యతిరేకించబోనని అన్నారు.

మరోవైపు స్టాక్ మార్కెట్ల నియంత్రణను పరిశీలించి.. అవసరమైన సిఫార్సులు, సూచనలు చేసేందుకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు గత నెలలో ఏర్పాటు చేసింది. అయితే అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని బృందంతో విచారణ జరిపిస్తే మంచిదని గతవారం శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. ఆ డిమాండ్‌ నుంచి తాజాగా వెనక్కి తగ్గారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 20న) గౌతమ్‌ అదానీ స్వయంగా శరద్‌ పవార్‌ ఇంటికి వెళ్లి ఆయనను కలువడం, రెండు గంటలకుపైగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు..? ఏయే అంశాలపై  చర్చించారనే దానిపై ఆసక్తి నెలకొంది.