అర్నాల్ట్​ కంటే 6 బిలియన్ డాలర్లే తక్కువ..

అర్నాల్ట్​ కంటే  6 బిలియన్ డాలర్లే తక్కువ..

వెలుగు బిజినెస్​ డెస్క్​:మొదట ఆయన ఆసియాలోనే సంపన్నుడిగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నెట్​వర్త్​ వారెన్​ బఫెట్​, బిల్​ గేట్స్​ వంటి దిగ్గజాలను దాటేసింది. ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది కదూ. ఆయనే అదానీ గ్రూప్ బాస్‌  గౌతమ్​ అదానీ. తాజాగా ఆయన సంపద చాలా వేగంగా పెరగడంతో మూడో ప్లేస్​లోని  జెఫ్​ బెజోస్​ను కూడా వెనక్కి నెట్టేశారు. అంతేకాదు, రెండో ప్లేస్​లోని బెర్నార్డ్​ అర్నాల్ట్​(154.5 బిలియన్​ డాలర్లు)  నూ దాటేసే ప్రయత్నంలో దూసుకెళ్తున్నారు. అర్నాల్ట్​ సంపదకూ అదానీ ఇప్పటి సంపదకూ పెద్దగా తేడా కనబడటం లేదు. ఫోర్బ్స్​ రియల్​టైమ్​ బిలియనీర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం గౌతమ్​ అదానీ సంపద 148.3 బిలియన్​ డాలర్లకు చేరింది. గత కొన్నేళ్లలోనే అదానీ నెట్​వర్త్​ రాకెట్​ వేగంతో పెరగడం విశేషం. కిందటి ఏడాది కాలంలో చాలా మంది సంపన్నుల సంపద తగ్గుతుంటే అదానీ మాత్రం తన సంపదను భారీగా పెంచుకోవడం గమనించదగ్గది. ఆయిల్​ అండ్​ నేచురల్​ గ్యాస్​ రేట్లు పెరగడం కూడా ఆయన సంపద పెరుగుదలకు సాయపడింది.  ఎంఎస్​సీఐ వరల్డ్​ఎనర్జీ ఇండెక్స్​ 2022లో ఏకంగా 36 శాతం రిటర్న్స్​ను ఇచ్చింది.

కొన్ని షేర్లు 1000 శాతం పెరుగుదల....
అదానీ గ్రూప్​లోని కొన్ని కంపెనీల షేర్లు ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువే పెరిగాయి. అదానీ గ్రీన్​ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్​, అదానీ ఎంటర్​ప్రైజస్​, అదానీ ట్రాన్స్​మిషన్​ షేర్లు భారీగా జంప్​ చేశాయి. 2020 నుంచి చూస్తే గ్రూప్​లోని కొన్ని కంపెనీల షేర్లయితే ఏకంగా 1000 శాతం పెరగడం విశేషం. ఇదే కాలంలో సెన్సెక్స్​ కేవలం 44 శాతం పెరిగింది.

3 గిగా ఫ్యాక్టరీలు పెడతాం..
సోలార్​ మాడ్యూల్స్​, విండ్​ టర్బైన్స్​, హైడ్రోజన్​ ఎలక్ట్రోలైజర్స్​ తయారీ కోసం రూ.5.6 లక్షల కోట్ల (70 బిలియన్ డాలర్ల) తో మూడు గిగా ఫ్యాక్టరీలు పెట్టనున్నట్లు బుధవారం నాడు అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ వెల్లడించారు. 2030 లోపే ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. వరల్డ్​ టాప్​ రెన్యువబుల్​ ఎనర్జీ ప్రొడ్యూసర్​ లిస్టులో చేరడమే తమ టార్గెట్​గా పేర్కొన్నారు. యూఎస్​ఐబీసీ గ్లోబల్​ లీడర్​ షిప్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలిసిలికాన్​ నుంచి సోలార్​ మాడ్యూల్స్​, విండ్​ టర్బైన్స్​, హైడ్రోజన్​ ఎలక్ర్టోలైజర్స్​ను ఈ గిగా ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేస్తాయని అదానీ పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న 20 గిగా వాట్లకు అదనంగా మరో 45 గిగా వాట్లను తాము ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 2030 నాటికి 3 మిలియన్​ టన్నుల హైడ్రోజన్​ ప్రొడక్షన్​ టార్గెట్​ అందుకోనున్నట్లు చెప్పారు. అయిదవ గిగా ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ఇటీవలే  రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 

యూఎస్​‑ఇండియా జీడీపీ 70 ట్రిలియన్​ డాలర్లు...
2050 నాటికి అమెరికా, ఇండియాల జీడీపీ 70 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని, ఇది గ్లోబల్​ ఎకానమీలో 40 శాతానికి సమానంగా ఉంటుందని అదానీ పేర్కొన్నారు.  అప్పటికి ఈ రెండు దేశాల జనాభా కూడా 2 బిలియన్​లవుతుందని అన్నారు. అమెరికా–ఇండియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 150 బిలియన్​ డాలర్లేనని, దీనిని భారీగా పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు.