పనిభారంతో గిగ్ వర్కర్లు విలవిల .. 12 గంటలకుపైనే పని

పనిభారంతో గిగ్  వర్కర్లు విలవిల ..  12 గంటలకుపైనే పని

    

హైదరాబాద్, వెలుగు :  దేశంలో ఫుడ్​ డెలివరీ, ట్రాన్స్​పోర్టు, ప్యాకేజీ డెలివరీలలో పనిచేసే గిగ్​ వర్కర్లపై పనిభారం, ఒత్తిడి పెరుగుతున్నది ఢిల్లీకి చెందిన జన్​పహల్​ ఎన్జీవో సర్వేలో తేలింది. దేశంలో ఎక్కువ శాతం గిగ్​ వర్కర్లు 8 గంటలకు పైనే పనిచేస్తున్నారని, మరికొందరు 12 గంటలకు పైగా పనిచేస్తున్నారని ఆ సర్వే నివేదిక వెల్లడించింది. టార్గెట్లు, ఇన్ టైం డెలివరీల వల్ల గిగ్  వర్కర్లలో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. ఈ రంగంలో పనిచేసే మహిళల్లో అధిక శాతం మంది అభద్రతా భావానికి గురవుతున్నారని సర్వే పేర్కొంది. దేశంలో గిగ్​ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జన్ పహల్  ఎన్జీవో సర్వే చేసింది. దేశంలోని 32 (టైర్​1 నుంచి 3) నగరాల్లో 20కి పైగా డిజిటల్ ఫ్లాట్  ఫామ్​లలో లింక్  అయి ఉన్న 5,220 మంది గిగ్​ వర్కర్లను సర్వే చేశారు. వారి అభిప్రాయం ఆధారంగా గురువారం సర్వే రిపోర్టును విడుదల చేశారు. 

సర్వే రిపోర్టు ప్రకారం.. గిగ్​ వర్కర్లలో 31 ఏండ్లకు పైబడినవారు 85 శాతం మంది  డ్రైవర్లుగా, రైడర్లుగా రోజూ 8 గంటలపైనే పనిచేస్తున్నారు. మరో 21 శాతం మంది రోజూ 12 గంటలకు పైనే పనిచేస్తున్నారు. టార్గెట్లు, ఇన్​టైమ్​ డెలివరీల వల్ల వాహనాలు వేగంగా నడపాల్సి వస్తోందని ఎక్కువ మంది వర్కర్లు తెలిపారు. ఫలితంగా ఒత్తిడి, కుంగుబాటు లాంటి మానసిక, శారీరక సమస్యల బారిన పడుతున్నామని 99 శాతం వర్కర్లు తెలిపారు. గిగ్​ వర్కర్లలో 2.3 శాతం మహిళలు ఉండగా,  సర్వేలో స్పందించిన వారిలో 65 శాతం మంది మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు, సంస్థలకు జన్​ పహల్​ పలు సూచనలు చేసింది. గిగ్‌‌  కార్మికులను తక్కువ వేతనం, దోపిడీ నుంచి రక్షించడానికి కంపెనీలు న్యాయమైన, పారదర్శక చెల్లింపులు చేసేలా నిబంధనలు తీసుకురావాలని సూచించింది. ఓవర్​ టైమ్​ వర్క్​ చేస్తే అదనంగా చెల్లించేలా చూడాలని పేర్కొంది. వర్కర్ల ఐడీలను బ్లాక్‌‌ చేయకూడదని సూచించింది.

ఏండ్లుగా గిగ్​ వర్కర్లుగానే 

57 శాతం మంది రెండు నుంచి ఐదేండ్లుగా గిగ్​ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఐదేండ్లకు పైగా పనిచేస్తున్న వర్కర్లలో 33 శాతం మంది 41–50 ఏండ్ల మధ్య ఉండగా, 44 శాతం మంది 31 – 40 ఏండ్ల మధ్య ఉన్నారు. 47 శాతం మంది రెండేండ్లకు పైగా గిగ్‌‌  కార్మికులుగా కొనసాగుతున్నారు. ఐదేండ్లకు మించి పనిచేస్తున్న వారు 16 శాతం ఉన్నారు. ఇతర ఉద్యోగాలు లభించకపోవడం వల్ల వృద్ధ కార్మికులు ఎక్కువకాలం గిగ్  వర్కర్లుగా కొనసాగుతున్నారు. కాగా, కరోనా తరువాత గిగ్​ రంగంలోకి వచ్చేవారి సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో వర్కర్ల సగటు ఆదాయం చాలా వరకు  తగ్గిపోయింది. ఎక్కువ సమయం పనిచేసినా... మెయింటెనెన్స్, పెట్రోల్, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.15 వేల నుంచి 20 వేలు మాత్రమే మిగులుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక 22 నుంచి -30 ఏండ్ల మధ్య గిగ్‌‌  వర్కర్లలో చాలా మంది ఈ వృత్తిని తాత్కాలిక ఉద్యోగంగా భావిస్తున్నారు. కాగా, 2020–21 నాటికి దేశంలో మొత్తం 77 లక్షల మంది గిగ్​ వర్కర్లు ఉండగా, 2029–30 నాటికి వారి సంఖ్య 2.35 కోట్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్​ అంచనా వేసింది.