డేంజర్​ కెమికల్స్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్

డేంజర్​ కెమికల్స్​తో  అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 700 కిలోలు పట్టుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు
  • బేగంబజార్ అడ్డాగా దందా
  • కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారీ
  • రంగు, వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్
  • దక్కన్‌‌ ట్రేడర్స్‌‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై.. నలుగురు అరెస్టు

హైదరాబాద్‌‌, వెలుగు: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌‌ తయారు చేసి అమ్ముతున్న ముఠాను సిటీ సెంట్రల్ జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 20 కిలోలు కుళ్లిన అల్లం, కెమికల్స్, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని టాస్క్​ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. బేగంబజార్ అడ్డాగా ఈ దందా కొనసాగిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. గుజరాత్​కు చెందిన రహీం చరనియా (36) కొంత కాలం కింద హైదరాబాద్ వచ్చి బేగంపేట్​లో నివాసం ఉంటున్నాడు. దక్కన్ ట్రేడర్స్ పేరుతో అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేసి సప్లయ్ చేస్తున్నాడు. 

ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో గోదాము ఏర్పాటు చేశాడు. అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ, ప్యాకింగ్ కోసం స్పెషల్ మిషనరీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నాసిరకం, కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లిని తీసుకొచ్చి పేస్ట్​గా తయారు చేస్తున్నాడు. అందులో దొడ్డు ఉప్పు, చిక్కదనం కోసం పిండి, కలరింగ్, వాసన కోసం కెమికల్స్ కలుపుతున్నాడు. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కొన్ని రసాయనాలు వాడుతున్నట్టు గుర్తించారు. ఈ పేస్ట్​ను ఎలాంటి గుర్తింపు లేని కంపెనీల పేర్లతో నకిలీ ఐఎస్ఐ స్టిక్కర్స్ అంటించి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాడు. హోల్​సేల్ మార్కెటింగ్ కోసం తెలంగాణ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రొప్రైటర్ అజయ్ కుమార్ (43), నిఖిల్ ట్రేడర్స్ కు చెందిన ప్రదీప్ సంకాల (29) సహా బేగంపేట పాటిగడ్డకు చెందిన పాండురంగారావు (72) ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు.

బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకింగ్

బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుల్స్, స్టిక్కర్స్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. 50 గ్రాముల నుంచి కిలో బాక్సులు, ప్యాకెట్లతో సప్లై చేస్తున్నారు. ప్రధానంగా బేగంబజార్, సికింద్రాబాద్‌‌లోని హోల్‌‌సేల్ మార్కెట్స్‌‌, పాతబస్తీ, గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా జనరల్‌‌ స్టోర్స్‌‌కు తరలిస్తున్నారు. ఈ నకిలీ పేస్ట్‌‌పై సిటీ సెంట్రల్ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. బేగంబజార్‌‌‌‌లోని తెంగాణ ఏజెన్సీ, నిఖిల్‌‌ ట్రేడర్స్‌‌ నుంచి నకిలీ పేస్ట్‌‌ సప్లయ్ అవుతున్నట్లు గుర్తించారు. బేగంబజార్‌‌‌‌లోని ట్రేడర్స్‌‌తో పాటు బేగంపేట పాటిగడ్డలోని పాండురంగారావు గోదాముల్లో సోదాలు చేశారు. ఉప్పరపల్లిలోని రహీం కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నకిలీ అల్లం వెల్లుల్లి లభించింది.