
- రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఆగస్టులో రాష్ట్ర సర్కారు రహస్య జీవో
- ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుతో అక్టోబర్ 30న వెలుగులోకి
- హైకోర్టు తాజా తీర్పుతో సీబీఐకి తొలగిన అడ్డంకులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా జారీ చేసిన జీవో నంబర్ 51 ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో విచారణకు అడ్డు కాబోదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇలా జనరల్ కాన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతితో సీబీఐ వెళ్లి విచారణ జరపడమే కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించడంతో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆపలేదని లీగల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం, దానిపై సీబీఐ విచారణ చేపట్టడం వంటి పరిణామాల క్రమంలో రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కాన్సెంట్ రద్దు చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 51ని తీసుకువచ్చింది. ఆగస్టు 30నే జీవో ఇచ్చినా ప్రభుత్వం దానిని రహస్యంగా ఉంచింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుపై హైకోర్టులో సర్కారు దాఖలు చేసిన మెమోతో అక్టోబర్ 30న జీవో 51 విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐని ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ తప్ప మిగతా ఏ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ జనరల్ కాన్సెంట్ తప్పనిసరి. తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు జనరల్ కాన్సెంట్ ఇస్తూ జీవో నం. 160ని 2016 సెప్టెంబర్ 23న జారీ చేసింది.
దాన్ని ఈ ఏడాది ఆగస్టు 30న విత్‌డ్రా చేసుకుంటున్నట్లు జీవో 51ని తెచ్చింది. రాష్ట్ర సర్కారు సీబీఐకి ఇచ్చిన జనరల్ కాన్సెంట్ విత్ డ్రా చేసుకోవడంతో అవినీతి నిరోధక చట్టం - 1988 సహా అనేక కేంద్ర చట్టాల ప్రకారం సీబీఐ తెలంగాణలో విచారణ జరిపే అవకాశం లేకుండా పోయింది. అయితే.. ప్రస్తుతం జీవో నం.51 అమలులో ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి.
ఎన్నో కేసుల్లో కోర్టుల అనుమతితో ముందుకు
- గతంలోనూ జనరల్ కాన్సెంట్ రద్దు చేసిన రాష్ట్రాల్లోకి కోర్టుల జోక్యంతో సీబీఐ అడుగుపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాణా స్కామ్‌లో సీబీఐ విచారణను అడ్డుకునేందుకు అప్పట్లో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కాన్సెంట్ విత్ డ్రా చేసింది.
- సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించి బీహార్‌లో అడుగుపెట్టింది. దాణా కేసులో దర్యాప్తు పూర్తి చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన లాలూప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారు.
- హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్‌పైనా సుప్రీంకోర్టు అనుమతితో సీబీఐ విచారణ జరిపింది.
- జార్ఖండ్‌లోకి సీబీఐ అడుగు పెట్టకుండా అప్పట్లో మధుకోడా ప్రభుత్వం.. అనుమతిని రద్దు చేస్తూ జీవో తెచ్చింది. కోర్టు ఆ జీవోను కొట్టేయడంతో.. అప్పట్లో సీఎంగా ఉన్న మధు కోడాను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.