అమ్మ వంట  ఈజీ చేసేందుకు డివైజ్​ తయారీ

అమ్మ వంట  ఈజీ చేసేందుకు డివైజ్​ తయారీ

ఒకపక్క పొయ్యిపై పాలు పొంగుతుంటాయి. అంతలోనే ‘బ్రేక్​ఫాస్ట్​ రెడీనా ?’ అంటూ హాల్​లోంచి ఒక అరుపు...టిఫిన్​ చేతికిచ్చి కిచెన్​లోకి వచ్చేసరికి  కూర అడుగు అంటుతుంటుంది. ఆ హడావిడిలో ఉండగానే ‘అమ్మా! స్కూల్​కి లేటు అవుతుంది. లంచ్​ బాక్స్​ ఇంకా అవ్వలేదా’? అంటూ పిల్లల కస్సుబుస్సులు. ఆ వెంటనే ఇల్లు సర్దాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. మళ్లీ ఈవెనింగ్ శ్నాక్స్​, రాత్రి డిన్నర్​.ఈ పనులన్నీ ముగించుకునే సరికి రాత్రి పదకొండు. మళ్లీ ఉదయం ఆరింటికి కిచెన్​లో లైటు వెలుగుతుంది. ఇది ప్రతి హౌస్​ వైఫ్​ కథే. ఇక వర్కింగ్​ విమెన్​​ చేసే మల్టీ టాస్కింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఇంటి, వంట పనులతో తన  తల్లి పడుతున్న  ఇబ్బందుల్ని చూడలేకపోయింది పద్నాలుగేళ్ల నవశ్రీ ఠాకూర్. ఆ బాధే ఒక డివైజ్​ తయారీకి కారణమయింది. అంతేనా అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

మన దేశంలో ప్రతి హౌస్​ వైఫ్​ రోజులో 356 నిమిషాలు అంటే దాదాపుగా ఆరు గంటలు ఇంటి, వంట పనులకే కేటాయిస్తోంది. క్లీనింగ్​, కుకింగ్​ పూర్తిచేసుకుని ఆఫీసులకెళ్లే ఆడవాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు మధ్య ప్రదేశ్​కి చెందిన రజినీ బాయ్​. ఆమె రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేస్తుంది. టీ, టిఫిన్​లతో పాటు మధ్యాహ్నానికి అన్నం, కూరలు వండి ఆఫీసుకి వెళ్తుంది. మళ్లీ తిరిగొచ్చి  నేరుగా వంటింట్లోకి వెళ్లి డిన్నర్​ ఏర్పాట్లు. ఆదివారం కిచెన్​లో ఎక్స్​ట్రా డ్యూటీ తప్పదు. తల్లి   నిమిషం రెస్ట్​ లేకుండా రేయింబవళ్లు పనిచేయడం తట్టుకోలేక పోయింది నవశ్రీ. 
అమ్మ కోసం..
అమ్మకి సాయం చేయాలని బలంగా ఉంది నవశ్రీకి. కానీ, ఉదయం స్కూల్​కి వెళ్తే  తిరిగొచ్చే సరికి సాయంత్రం అవుతుంది. ఇంటికొచ్చాక హోం వర్క్. అయినా సరే తనకున్న కొద్ది టైంలోనే తల్లికి వంట పనుల్లో సాయం చేసేది. కూరగాయలు తరుగుతూ..అమ్మకి కొంచెం రిలాక్సేషన్​ ఇచ్చేది. కానీ, తృప్తి లేదు. తల్లి కష్టం ముందు తన సాయం చాలా చిన్నదనిపించింది. ఇదే విషయం టెన్త్​ క్లాస్ చదువుతున్న అక్క పిపారియాకి చెప్పింది. తను కూడా చెల్లి ఆలోచనకి సాయం చేయడానికి ముందుకొచ్చింది. అక్క సపోర్ట్​తో తల్లి కోసం ఒక డివైజ్​ తయారు చేయాలనుకుంది నవశ్రీ. 
కార్పెంటర్లను కలిసింది
ఆలోచన మంచిదే.. కానీ, ఎక్కడ్నించి  మొదలుపెట్టాలో అర్థం కాలేదు నవశ్రీకి. చాలా రీసెర్చ్​ చేసింది.  ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఇంటి, వంట పనులని సులభతరం చేయడానికి ఎనిమిది రకాలుగా ఉపయోగపడే డివైజ్​ ఐడియా తట్టింది. ఆ వెంటనే గ్రౌండ్​వర్క్​  మొదలుపెట్టింది. పేపర్​పై రఫ్​ డిజైన్​​ గీసింది. చిన్నచిన్న సైన్స్​ ప్రిన్సిపల్స్​ అప్లయ్​ చేసి డివైజ్​ తయారు చేసింది.   కానీ, మొదటి ప్రయత్నం ఫెయిల్​ అయింది. అయినా వెనుకడుగేయలేదు. తన సైన్స్​ టీచర్​ని కలిసింది. చుట్టు పక్కల ఊళ్లలోని కార్పెంటర్​ల​తో మాట్లాడింది. వాళ్లందరి సపోర్ట్​, సజెషన్స్​తో  దాదాపు రెండేళ్లు కష్టపడి ఒక  డివైజ్​ని తయారుచేసింది. రిజల్ట్​ బాగుండటంతో తన తల్లిలా ఇంటి, ఆఫీసు పనులతో సతమతమవుతున్న వాళ్లకోసం ‘మల్టీ యూజ్​ కిచెన్​ మెషిన్’ ​ పేరుతో ఆ డివైజ్​ని  మార్కెట్​లోకి తీసుకొచ్చింది.

ఎలా పనిచేస్తుంది?  
చెక్క, స్టీల్​ ప్లేట్స్​, కప్పులతో  తయారుచేసిన ఈ మెషిన్​ చూడ్డానికి అచ్చం  బిల్డింగ్​ బ్లాక్స్​లా ఉంటుంది. పని అయిపోయాక చక్కగా మడిచి పక్కన పెట్టొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మల్టీ యూజ్ కిచెన్​ మెషిన్​ సాయంతో​ ​ఒకేసారి ఎనిమిది పనులు చేయొచ్చు. కూరగాయలు ​ తరగొచ్చు. నిమిషాల్లో ఫ్రూట్​, వెజిటబుల్ జ్యూస్​లు తీయొచ్చు. మసాలాలు కూడా తయారు చేయొచ్చు. వేడి వేడి రొట్టెలతో  పాటు మరెన్నో పనులు చేయొచ్చు. ఈ డివైజ్​ తయారుచేసినందుకు నవశ్రీకి ​నేషనల్​ ఇన్నోవేషన్​ ఫౌండేషన్​ ఇన్​స్పైర్​ అవార్డు  వచ్చింది. ఈ డివైజ్​ మార్కెట్​లో​ 
3,000 రూపాయలకి అందుబాటులో ఉంది.