చొప్పదండి, వెలుగు: తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో వివాహం చేసుకోవడానికి సిద్ధమైన ప్రియుడి పెళ్లిని ప్రేమికురాలు అడ్డుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్ హైటెక్ సిటీ, దుర్గం చెరువు సమీపంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన, చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో వెహికల్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పిడుగు నరేశ్‌తో 12 ఏండ్లుగా ప్రేమలో ఉన్నది. తనను కాదని మరో యువతితో వివాహం చేసుకోవడానికి నరేశ్ సిద్ధమయ్యాడు. చొప్పదండిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుందని తెలిసి యువతి మహిళా మండలి సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. అప్పటికి వధూవరులు హాల్‌కు చేరుకోలేదు. తన వద్ద ఉన్న ఆధారాలను చూపించి వివాహాన్ని నిలిపివేయాలని కోరింది. నరేశ్ కుటుంబ సభ్యులు యువతిని అక్కడి నుంచి పంపించాలని ప్రయత్నించినప్పటికీ, విషయం తెలిసిన వధువు తండ్రి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనతో కాబోయే పెండ్లి కూతురు అస్వస్థతకు గురికాగా ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వివాహం రద్దు విషయంపై వధువు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
