బీఏలో ఎస్సీ, ఎస్టీలు.. బీబీఏలో ఓసీలు

బీఏలో ఎస్సీ, ఎస్టీలు.. బీబీఏలో ఓసీలు
  • ఓసీ, బీసీల్లో బాయ్స్​తో పోటీగా గర్ల్స్ స్టడీ 
  • బీకాంలో హయ్యెస్ట్ అడ్మిషన్లు.. 
  • తర్వాత బీఎస్సీ, బీఏ కోర్సులు 
  • ‌‌‌‌‌‌‌‌ఓయూలో 90 వేలు, కేయూలో 60 వేల మంది చేరిన్రు
  • ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్ల తీరిది

హైదరాబాద్, వెలుగు: పేరెంట్స్ ఆదాయం, సోషల్ కేటగిరిని బట్టే చదువులుంటాయని మరోసారి డిగ్రీ అడ్మిషన్లు తేటతేల్లం చేశాయి. సాంప్రదాయ బీఏ కోర్సులో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లు ఎక్కువ మంది చేరితే, కొత్తగా తీసుకొచ్చిన బీబీఏ కోర్సులో ఓసీ స్టూడెంట్లు ఎక్కువ మంది అడ్మిషన్లు తీసుకున్నారు. మరోపక్క ఓసీ, బీసీ కేటగిరిల్లో అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు చదువుతుండగా, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లలో మాత్రం భారీగానే వ్యత్యాసం కన్పిస్తోంది. అయితే డిగ్రీలో ఈ ఏడాది బీకాంలో హయ్యస్ట్ అడ్మిషన్లు జరగ్గా, తర్వాతే బీఎస్సీ, బీఏ కోర్సులున్నాయి. 2021–22 అకడమిక్ ఇయర్​డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. 

962 కాలేజీలు

రాష్ట్రంలో 962 సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా ఫస్టియర్​లో 4,17,740 సీట్లుంటే, 2,29,154 మంది చేరారు. రెసిడెన్షియల్స్, నాన్ దోస్త్ కాలేజీల అడ్మిషన్లతో కలిపి ఈ ఏడాది 2,52,248 స్టూడెంట్లు డిగ్రీలో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఏడాది 46 ప్రైవేటు కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు. అయితే కులాల వారీగా బీఏ కోర్సులో ఎస్సీలు 7,492 మంది, ఎస్టీలు 6,483 మంది చేరితే, ఓసీలు కేవలం 4,673 మందే చేరారు. బీసీ స్టూడెంట్లు 17,520 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సులో మొత్తం 8,368 మంది చేరితే, వారిలో ఎస్సీలు 881 మంది, ఎస్టీలు 252 మంది చేరితే, ఓసీలు 3,437 మంది అడ్మిషన్లు పొందారు. 

ఎస్సీ, ఎస్టీల్లో చదివేది అబ్బాయిలే..

డిగ్రీ అడ్మిషన్లలో ఓసీ, బీసీ కేటగిరిల్లో బాయ్స్​తో దాదాపు సమానంగా గర్ల్స్ అడ్మిషన్లున్నాయి. బీసీ–ఏ, ఈ కేటగిరిల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ మంది డిగ్రీలో చేరారు. కానీ ఎస్సీ, ఎస్టీ కేటగిరిల్లో మాత్రం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల అడ్మిషన్లలో భారీగా తేడా ఉంది. ఆ కేటగిరిలో అబ్బాయిలే ఎక్కువ మంది డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఓసీల్లో 24,779 మంది అబ్బాయిలు, 23,521 మంది అమ్మాయిలు చేరారు. ఎస్సీల్లో బాయ్స్ 20,345 మంది, గర్ల్స్​ 16,549 మంది అడ్మిషన్లు తీసుకోగా, ఎస్టీల్లో 12,537 మంది అబ్బాయిలు చేరితే, 9117 మంది అమ్మాయిలు చేరారు. ఎస్సీ, ఎస్టీ పేదల్లో చదివించే స్థోమత లేకపోవడంతో అబ్బాయిల చదువులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. 

బీకాంలోనే ఎక్కువమంది చేరిర్రు

ఈ ఏడాది బీకాం కోర్సులో హయ్యెస్టు అడ్మిషన్లు జరిగాయి. బీకాంలో 95,538 మంది చేరితే, బీఎస్సీ ఫిజికల్ సైన్స్​లో 44,181 మంది, బీఎస్సీ లైఫ్​ సైన్స్​లో 42,670, బీఏలో 36,167, బీబీఏలో 8,368, బీసీఏలో 1,406, డిప్లొమాలో 612, ఒకేషనల్​లో 36,  బీబీఎంలో 96 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఏడాది 46 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు జరగ్గా, 184 కాలేజీల్లో 30%లోపే అడ్మిషన్లు జరిగాయి. వీటిలో 4 సర్కారు, 180 ప్రైవేటు కాలేజీలున్నాయి. 30–49%లోపు  247 కాలేజీలు, 50–79% లోపు అడ్మిషన్లు జరిగిన కాలేజీలు 396 ఉన్నాయి. 80శాతానికి పైగా అడ్మిషన్లు 28 సర్కారు, 107 ప్రైవేటు కాలేజీల్లో జరిగాయి.