ఒక్క ఛాన్స్ ఇవ్వండి : ఇమ్రాన్ ఖాన్

ఒక్క ఛాన్స్ ఇవ్వండి : ఇమ్రాన్ ఖాన్

పఠాన్‌ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ అన్నారు. తాజాగా మోడీ ఈ మాటలను ఇమ్రాన్‌కు గుర్తుచేస్తూ మాట నిలబెట్టుకుంటావా? అని సవాల్ విసిరారు. దీనికి ఇమ్రాన్ స్పందించారు. తాను తన మాటకు కట్టుబడి ఉంటానని, ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలు లభిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని కార్యాలయం తెలిపింది. మాట నిలబెట్టుకుంటానని, శాంతి కోసం తనకు ఓ అవకాశం ఇవ్వాలని భారత ప్రధాని మోడీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేసినట్లు చెప్పింది.

ఇటీవల పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 44 మంది  CRPF జవాన్లు వీర మరణం పొందారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఉగ్రవాద దాడులకు తప్పక ప్రతీకారం ఉంటుందని మోడీ హెచ్చరించారు. దీంతో భారత్ చేసే దాడులను తిప్పికొడతామని పాక్‌ బదులిచ్చింది. దీనిపై స్పందించిన మోడీ.. ‘పాక్‌ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌‌ ఎన్నికైనప్పుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పాను. ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను నిర్మూలించేందుకు కృషి చేద్దామని కోరాను. అందుకు ఇమ్రాన్ ఒప్పుకోవడమే కాకుండా, తాను అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారా? అని మోడీ సవాల్‌ విసిరారు.