
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. దాదాపు 70 లక్షల మంది పైగా కరోనా బారినపడగా.. వారిలో 34 లక్షల మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 31 లక్షల మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్ర రాజ్యమైన అమెరికాలో అత్యధికంగా 19 లక్షల 88 వేల మందికి కరోనా సోకింది. వారిలో లక్షా 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి ఏడున్నర లక్షల మంది కోలుకోగా.. ప్రస్తుతం 11 లక్షల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇప్పటికే 2 కోట్ల కరోనా టెస్టులు చేసినట్లు వరల్డో మీటర్ సంస్థ పేర్కొంది. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యాల్లో భారీ సంఖ్యలో కేసుల నమోదవుతున్నాయి. బ్రెజిల్ లో 6.76 లక్షల మందికి కరోనా సోకగా, 36 వేల మంది మరణించారు. రష్యాలో 4.67 లక్షల మంది కరోనా బారినపడగా.. 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్ లో 2.47 లక్షల మందికి వైరస్ సోకింది. దేశంలో 6,900 మంది మరణించగా.. 1,19,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1.21 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.