
- ఆర్థిక స్వేచ్ఛ రావడానికి మరో 257 ఏళ్లు
- డబ్ల్యూఈఎఫ్ జెండర్ గ్యాప్ రిపోర్టు
- 108 నుం చి 112వ స్థానానికి
- పడిపోయిన ఇండియా
- ఐస్ లాండ్ టాప్ .. 11 ఏళ్లుగా ఫస్ట్ ర్యాంక్
ప్రపంచం మొత్తం మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. చదువు, రాజకీయాలు, ఆర్థిక స్వేచ్ఛ వంటి విషయాల్లో తామేంటో చూపిస్తున్నారు. మరి, ఆ మాటలకు తగ్గట్టు నిజంగా మహిళలకు సమాన హక్కులు ఉంటున్నాయా? అంటే, వాళ్లకు సమానత్వం రావాలంటే వందేళ్లు పడుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అంటోంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే మహిళా సమానత్వంలో కొంత పురోగతి కనిపించిందని చెబుతోంది. 2018లో 108 ఏళ్లు పడుతుందన్న డబ్ల్యూఈఎఫ్, ఈ ఏడాది అది 99.5 ఏళ్లకు తగ్గిందని వెల్లడించింది. మంగళవారం జెండర్ పారిటీపై డబ్ల్యూఈఎఫ్ ఓ రిపోర్టును విడుదల చేసింది. చదువు, ఆరోగ్యం, రాజకీయం, ఆర్థిక స్వేచ్ఛ వంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుని 153 దేశాలపై రిపోర్టును తయారు చేసింది. ఈ విషయంలో ఐస్లాండ్ టాప్‌లో నిలవగా, యెమన్ అట్టడుగున నిలిచింది. పాకిస్థాన్ 151వ ర్యాంకును సాధించింది. బంగ్లాదేశ్ 50వ ర్యాంకును దక్కించుకుంది.
పడిపోయిన ఇండియా
మహిళా సమానత్వంలో ఇండియా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 108వ స్థానంలో నిలిచిన ఇండియా, ఈ ఏడాది 112వ ర్యాంకుకు దిగజారింది. ఆరోగ్యం, ఆర్థిక స్వేచ్ఛలో అడుగు నుంచి ఐదోస్థానంలో నిలిచింది. 2006లో ఫస్ట్ జెండర్ గ్యాప్ రిపోర్టును డబ్ల్యూఈఎఫ్ రిలీజ్ చేసినప్పుడు ఇండియా 98వ స్థానంలో ఉండేది. అప్పటి నుంచి ఇండియా ర్యాంకు పడిపోతూ వచ్చింది. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో మాత్రం మెరుగైన ర్యాంకును సాధించింది. ప్రస్తుతం 18వ స్థానంలో నిలిచింది. కానీ, ఆరోగ్యం విషయంలో 150, ఆర్థిక స్వేచ్ఛలో 149వ ర్యాంకుకు పడిపోయింది. చదువు విషయంలో 112వ స్థానంలో ఉంది. దేశంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అనేది పరిమితమైన విషయమని తేల్చి చెప్పింది. కేవలం 35.4 శాతం మహిళలు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని చెప్పింది. ఇటు కంపెనీ బోర్డుల విషయంలోనూ ఇండియా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ బోర్డుల్లో కేవలం 13.8 శాతం మంది మాత్రమే తమ మార్కును చాటుతున్నారని పేర్కొంది. మగాళ్లకు సమానంగా మహిళలకు ఆరోగ్య సేవలు అందట్లేదని చెప్పింది.
సెక్స్ రేషియోలోనూ ఇంకా తక్కువగానే ఉన్నట్టు పేర్కొంది. ప్రతి వంది మంది అబ్బాయిలకు కేవలం 91 మంది అమ్మాయిలే ఉన్నట్టు పేర్కొంది. దేశంలో ఆర్థిక స్వేచ్ఛ విషయంలో 2006 నుంచి జెండర్ గ్యాప్ బాగా పెరిగిపోయిందని వెల్లడించింది. లేబర్ మార్కెట్లో మగాళ్లతో (82%) పోలిస్తే ఆడవాళ్లకు అతి తక్కువ అవకాశాలు దొరుకుతున్నాయని తెలిపింది. ఈ విషయంలో 145వ స్థానంలో ఇండియా నిలిచింది. ఆదాయంలోనూ మహిళల వాటా కేవలం 20 శాతమేనని పేర్కొన్న డబ్ల్యూఈఎఫ్, 144వ ర్యాంకునిచ్చింది. ప్రొఫెషనల్, టెక్నికల్ రోల్స్‌లో కేవలం 30 శాతం మంది, లీడర్షిప్ రోల్స్‌లో 14 శాతం మంది మాత్రమే ఉన్నారని చెప్పింది. అయితే, రాజకీయాల పరంగా ఇండియాలో మహిళలకు మంచి అవకాశాలు అందుతున్నాయని రిపోర్టు వెల్లడించింది. గతంతో పోలిస్తే మహిళా లీడర్లు పెరిగారని చెప్పింది. పార్లమెంట్లో 14.4 శాతం మంది మహిళా నేతలతో 122వ ర్యాంకును సాధించింది. కేబినెట్లో 23 శాతం మంది మహిళలుండగా, 69వ స్థానంలో నిలిచింది.
ఆర్థిక అసమానత్వం పెరిగిపోతోంది
ఆర్థిక విషయాల్లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు చాలా వెనకబడిపోతున్నారని రిపోర్టు వెల్లడించింది. గత ఏడాది 58.1 శాతంగా ఉన్న ఆ తేడా ఈ ఏడాది 57.8 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఇలా అయితే, మహిళలు ఆర్థిక విషయాల్లో సమానత్వం సాధించాలంటే మరో 257 ఏళ్లు పడుతుందని చెప్పింది. గత ఏడాది (202 ఏళ్లు)తో పోలిస్తే ఈ ఏడాది ఆ గ్యాప్ భారీగా పెరిగిందని తెలిపింది. జీతాల్లో తేడా, లీడర్షిప్ అవకాశాలు, లేబర్ఫోర్స్లో అవకాశాలు, ఆదాయం వంటి విషయాలే దానికి ప్రధాన కారణాలని వెల్లడించింది. జీతాలు ఎక్కువగా ఉండే టెక్నాలజీ ఫీల్డ్‌లో మహిళలు ఎక్కువగా లేకపోవడమూ అందుకు కారణమని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో మాత్రం మహిళలు తమ మార్క్ వేస్తున్నారని చెప్పింది. ఈ విషయంలో జెండర్ గ్యాప్‌ను పూడ్చడానికి 95 ఏళ్లు పడుతుందని చెప్పింది. ప్రపంచం మొత్తంలో 25.2 శాతం మంది చట్టసభలకు వెళ్లగా, 21.2 శాతం మంది కేబినెట్లో చోటు దక్కించుకున్నారని తెలిపింది. గత ఏడాదితో (24.2%, 19%) పోలిస్తే రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందని చెప్పింది.