
లోకల్ బియ్యం.. లోకల్ కూరగాయాలు.. లోకల్ పత్తి.. ఇంతేనా ఇంకా ఎన్నో అన్నీ లోకలే..! అదే ‘ది కేరళ జైవ కర్షక సమితి’ స్పెషాలిటీ. దీని వయసు పాతికేళ్లు. దాదాపు 15 వేల మంది సేంద్రియ రైతుల సమూహమిది. వీళ్లలో రెండు సెంట్ల నుంచి రెండొందల ఎకరాల్లో పంటలు వేసే వాళ్లున్నారు. వీళ్లు పండించే ప్రతిదీ సేంద్రియ పద్ధతుల్లోనే. అదీ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో, వినూత్న పద్దతుల్లో పండిస్తారు. వీటిని మెచ్చిన చైనీస్ మున్సిపాలిటీ షిచోంగ్.. జైవ కర్షక సమితికి ‘ఆర్గానిక్ మెడల్ ఆఫ్ హానర్’ను ప్రకటించింది. జైవ కర్షక సమితి అన్నీ ఎన్జీవోల్లా పని చేయదు. పంచాయతీ, తాలుకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దీనికి వ్యవస్థ ఉంది. ఏటా బోర్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏదైనా ఈవెంట్ నిర్వహించాలంటే వీళ్లే సొంతంగా డబ్బు వేసుకుని జరుపుతారు. కేరళలో పుట్టిన బియ్యం, ఒక్రా, ఎగ్ ప్లాంట్, బీన్స్, పచ్చి మిరప లాంటి వెరైటీలను సమితి రైతులు పండిస్తున్నారు. ఆర్గానిక్ పంటలపై ఆసక్తి ఉన్నవారికి రైతులే 20 ఆదివారాలు, పొలాల్లో శిక్షణనిస్తారు. పురుగుమందులు వాడకుండా పంటను ఎలా కాపాడుకోవాలి. చేతికి అందిన పంటలోని పోషకాలు పోకుండా ఎలా వండుకు తినాలో కూడా నేర్పిస్తారు.