ఎట్టకేలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ' పెద్ది' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన జూన్ 25న కాకుండా.. మూడు వారాల ముందే డేట్ ను ఖరారు చేసింది. జూన్ 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.
పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో ఈ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖం నిండా రక్తంతో, అత్యంత తీవ్రమైన (Intense) చూపులతో ఉన్న రామ్ చరణ్ లుక్ చూస్తుంటే.. సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు.
జూన్ 4 వెనుక అసలు వ్యూహం ఇదే!
యష్ నటించిన 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో జూన్ 4వ తేదీ ఖాళీగా ఉంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని చరణ్ అభిమానులు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిమాండ్ చేశారు. అభిమానుల కోరిక మేరకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా వేసవి సెలవులు అడ్వాంటేజ్ గా మారింది. జూన్ మొదటి వారంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమన్న ధీమాలో మేకర్స్ ఉన్నారు. ఆ సమయంలో పెద్ద చిత్రాల పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్.
భారీ తారాగణం..
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు , సాయి కుమార్ వంటి ఉద్దండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ 'రా' అండ్ 'రస్టిక్' స్పోర్ట్స్ యాక్షన్ మూవీతో బుచ్చిబాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్, సినీ వర్గాలు ధీమాగా ఉన్నారు. మరి జూన్ 4న చరణ్ విశ్వరూపం ఏ మేరకు ఉంటుందో చూడాలి.
