ఏపీలో 98 శాతం జియో కవరేజ్ ఉంది: ముఖేశ్ అంబానీ

ఏపీలో 98 శాతం జియో కవరేజ్ ఉంది: ముఖేశ్ అంబానీ

భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ 90శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన పేర్కొన్నారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్‭లో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇండియా అభివృద్ధిలో ఏపీ నాయకత్వ పాత్ర పోషిస్తోందన్నారు. భారత్‭లో ఎన్నో రంగాల్లో ఏపీకి చెందిన నిపుణులు ఉన్నారని గుర్తుచేశారు. ఏపీ రాష్ట్రంలో ఆయిల్, గ్యాస్ రంగంలో పెట్టుబడులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. తిరుపతి, విశాఖతో పాటు అద్భుత వనరులున్న రాష్ట్రం ఏపీ అని కొనియాడారు.  తన రిలయన్స్ సంస్థలో కూడా ఏపీ నుంచి వచ్చిన మేనేజర్లు ఉన్నారని అంబానీ తెలిపారు. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. 

ఈ గ్లోబల్ సమ్మిట్ కు కార్పొరేట్ దిగ్గజాలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొన్నారు. అలాగే.. 25 దేశాలకు చెందిన 14వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. మొత్తం రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. సదస్సులో 14 కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు. మరోవైపు.. గ్లోబర్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.