
నస్పూర్, వెలుగు: ఉద్యోగులు పని స్థలాల్లో రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తామని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జీఎం ఆఫీస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ నెలలో ఏరియాలోని గనులు89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్కే 5 గని 93 శాతం, ఆర్కే 6 గని 73 శాతం, ఆర్కే 7 గని 82 శాతం, ఆర్కే న్యూ టెక్ గని 106 శాతం, ఎస్సార్పీ 1 గని 92 శాతం, ఎస్సార్పీ3 గని 58 శాతం, ఐకే 1ఎ గని 72 శాతంతో భూగర్భ గనులు 79 శాతం సాధించాయన్నారు. ఎస్సార్పీ ఓసీపీ 93 శాతం, ఐకే ఓసీపీ 89 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఏరియాలోని ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు.
సమ్మెపై పునరాలోచించాలి
లేబర్ కోడ్లకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా జరుగనున్న సమ్మె గురించి పునరాలోచించాలని జీఎం కోరారు. లేబర్ కోడ్లతో సింగరేణికి సంబంధం లేదని, వారికేమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, డీజీఎం(పి) అనిల్ కుమార్, డీజీఎం రాజన్న, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, సీనియర్ పీవో కాతారావు, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో 69 శాతం
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు జూన్లో 69 శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియా జీఎం జి.దేవేందర్ తెలిపారు. జీఎం ఆఫీస్లో మీడియా సమావేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 2.24 లక్షల టన్నులకు గాను 1.53లక్షల టన్నులు సాధించినట్లు చెప్పారు. ఏరియాలోని కేకే ఓసీపీలో నిర్దేశిత ఓవర్ బర్డెన్(మట్టి) టార్గెట్ 16 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను కేవలం 4.64 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే వెలికితీయడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు.
ఈ కారణంగా ఓసీపీలో 1.60 లక్షల టన్నులకు గాను 65 శాతంతో 1.04 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఓసీపీలో ఓబీ వెలికితీత పనులు చేపట్టేందుకు కొత్త కాంట్రాక్టర్ కోసం టెండర్ వేశామన్నారు. సమావేశంలో ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎస్ఈలు కిరణ్ కుమార్(ఐఈడీ), రాము(సివిల్), డీవైపీఎం అసిఫ్, సీనియర్ పీవో శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.