
కాజీపేట, వెలుగు : కాజీపేటలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ గురువారం తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక కోచ్‌లో కాజీపేటకు వచ్చిన జీఎం, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్లు స్థానిక వీఐపీ లాంజ్‌లో ఆఫీసర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జీఎంను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం జీఎం, డీఆర్‌ఎం, ఇతర రైల్వే ఆఫీసర్లు అయోధ్యపురంలో కోచ్ ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ యూనిట్, వ్యాగన్ మ్యానుఫాక్చర్ యూనిట్, కోచ్ ఫ్యాక్టరీ, మెయిన్ లైన్ ఎలక్రిక్ మల్టీపుల్ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు.
అంతర్గత పనులను ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంప్లీట్ చేసి ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అక్కడ నుంచి తిరిగి కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకొని.. అమృత్ భారత్ స్టేషన్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అయోధ్యపురంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన వారు జీఎంను కలిశారు. తమ పిల్లలకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్న ఆయన హామీ ఇచ్చారు.