
మెదక్ టౌన్, వెలుగు : కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన జిల్లా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఎస్పీ రోహిణి ప్రియదర్శిని న్యూ ఇయర్ విషెష్ తెలిపి ప్రశాంతాంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
క్యాలెండర్లు ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన్రు...
మెదక్ (శివ్వంపేట), వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని శనివారం రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ నర్సాపూర్ సెగ్మెంట్ కన్వీనర్ మల్లేశ్‌గౌడ్ కలిసి నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని నిర్వహించే కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆర్ఎం గ్రూప్ కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ ఇన్చార్జి సింగాయి పల్లి గోపి, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు నల్ల రవి గౌడ్, నర్సాపూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయగౌడ్, నాయకులు నాగప్రభు, ప్రవీణ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం కార్యాలయంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులి మామిడి రాజు ముదిరాజ్ ఆ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు మురళి, ప్రధాన కార్యదర్శి పిట్టల రమేశ్ మండల కన్వీనర్ యాదగిరి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
‘మన ఊరు మన బడి’ పనులు వేగవంతం చేయాలి
సిద్దిపేట, వెలుగు : జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల, దుళ్మీట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో మన ఊరు మన బడి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, కిటికీలు, డోర్లు, స్లాబ్, ఫ్లోర్ రిపేర్లు వేగంగా పూర్తి చేసి కలరింగ్ చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ పూర్తి చేశాకే మిగతా పనులు చేయాలని చెప్పారు. ఈజీఎస్ పనుల్లో చాలా వెనకబడి ఉన్నందున ఆయా పాఠశాలల పనులను పర్యవేక్షించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావును ఆదేశించారు. పాఠశాల బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
బీజేపీ నుంచి జంగం గోపి సస్పెండ్
సంగారెడ్డి, వెలుగు : సొంత పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన జహీరాబాద్ కు చెందిన జంగంగోపిని బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు గోపిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించినట్టు రాష్ట్ర ఆఫీస్ కార్యదర్శి డాక్టర్ బి.ఉమాశంకర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14న జహీరాబాద్ నియోజకవర్గం బర్దిపూర్ లో నిర్వహించిన ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడు సుధీర్ కుమార్, పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షుడు బోగా అడివన్న పార్టీ ఇతర నాయకులపై జంగం గోపి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై పార్టీ అధిష్టానానికి సుధీర్ కుమార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిజానిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను తెలుసుకున్న తర్వాత గోపిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.
కర్నాటకలో బీఆర్ఎస్ ను బలోపేతం చేస్తాం..
నారాయణ్ ఖేడ్, వెలుగు : కర్నాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలి గిద్ద మండలం మోర్గి పక్కన గల కర్నాటక బార్డర్ లోని చిల్లర్గి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామస్తులకు ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటక రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజలకు అందిస్తున్న అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను కర్నాటక రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే కర్నాటక రాష్ట్రం అంతా బీఆర్ఎస్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, వివిధ సర్పంచులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ..
నారాయణఖేడ్ పట్టణంలోని రామాలయంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి ఆధ్వర్యంలో, అలాగే మనుర్ మండలం డోవ్వుర్ లంక హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాలి
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్‌కు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. శనివారం ఎస్పీ ఆఫీసులో ఆపరేషన్ స్మైల్‌కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యవసాయం, మైనింగ్, హోటళ్లు తదితర వాటిలో పిల్లలు కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బాలకార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులకు విముక్తి కల్పించే లక్ష్యంతో ఆపరేషన్ ముస్కాన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. బాలకార్మికులు ఎక్కడ కనిపించినా 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆపరేషన్ స్మైల్‌కు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా ఏఎస్పీ బాలస్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ డీఈవో రమేశ్‌కుమార్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరుణశీల, నాగరాజు, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య, రాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఆపరేషన్ స్మైల్ సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో పోలీస్ యాక్టు అమలు
మెదక్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదన్నారు.
గీతా స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
మెదక్ జిల్లా తూప్రాన్ గీతా స్కూల్ లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ గ్రౌండ్ లో కలర్ ఫుల్ డ్రెస్సులతో " హ్యాపీ న్యూ ఇయర్" ను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్లు బి.రాఘవేందర్ గౌడ్, కె.నారాయణ గుప్త, ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకట కృష్ణారావు స్టూడెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- తూప్రాన్, వెలుగు