తెలంగాణలోకి గోవా లిక్కర్​

తెలంగాణలోకి  గోవా లిక్కర్​

మహబూబ్​నగర్, వెలుగు:  గోవా లిక్కర్​ తెలంగాణలోకి వస్తోంది. ప్రతి రోజూ ప్రైవేట్​ వాహనాల్లో లిక్కర్​ అక్రమ రవాణా జరుగుతోంది. కర్నాటక, తెలంగాణలో బార్డర్​ చెక్​ పోస్టులున్నా.. నామ్​కే వాస్తేగా మారాయి. తనిఖీలు చేసి లిక్కర్​ అక్రమ రవాణాను అరికట్టాల్సి ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు ఆఫీసర్లు మామూళ్లు తీసుకుంటూ ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిషేధమున్నా..

కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాకు వివిధ రాష్ట్రాలతో పాటు ఫారిన్​ నుంచి టూరిస్టులు వస్తుంటారు. టూరిస్టులను ఆకర్షించేందుకు ఇక్కడ లిక్కర్​పై పన్ను తక్కువగా వసూలు చేస్తుండటంతో బీర్లు, విస్కీ, బ్రాందీ అగ్గువకే దొరుకుతాయి. దీన్ని క్యాష్​ చేసునేందుకు హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. గోవా లిక్కర్​ను ఇతర రాష్ట్రాలకు తరలించడం, విక్రయించడంపై నిషేధం ఉన్నా అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇందు కోసం గోవా నుంచి వచ్చే డీసీఎంలు, లారీలు, మినీ డీసీఎంలు, టూరిస్ట్​ బస్సులను వాడుకుంటున్నారు. ప్రైవేట్​ బస్సుల డ్రైవర్లు సప్లయర్లుగా మారుతున్నారు. 

బార్డర్లు ఖుల్లా..

గోవా నుంచి తెలంగాణకు లిక్కర్​ రావాలంటే ముందుగా గోవా–కర్నాటక చెక్​పోస్ట్, తర్వాత కర్నాటక–-తెలంగాణ (కృష్ణ) చెక్ పోస్టులను దాటాలి. కర్ణాటక చెక్​పోస్ట్​ వద్ద అక్కడి ఆఫీసర్లు తనిఖీలు అంతంతమాత్రంగానే చేస్తున్నారు. ప్రైవేట్​ వాహన డ్రైవర్లతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఒక బాటిల్​కు రూ.300 చొప్పున ఎన్ని బాటిళ్లు తరలిస్తే అన్ని డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో అక్కడి ఆఫీసర్లు లిక్కర్  అక్రమ రవాణా గురించి పట్టించుకోవడం లేదు. 

తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణ వద్ద ఆర్టీవో, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్ల చెక్​పోస్టు ఉన్నా, కర్నాటక నుంచి వస్తున్న ప్రైవేట్  వెహికల్​ను​క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదు. నాలుగేండ్లుగా ఈ దందా సాగుతున్నా నియంత్రించడం లేదు. పైగా కృష్ణ బార్డర్​ చెక్​పోస్ట్​ వద్ద తనిఖీల్లో గోవా లిక్కర్​ దొరికితే, ఒక బాటిల్​ తీసుకొని వాహనాలను వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నమోదైన కేసులివే..

మహబూబ్​నగర్​ జిల్లాలో రెండేళ్లుగా పోలీస్, ఎక్సైజ్​ ఆఫీసర్లు తనిఖీలు చేసి గోవా లిక్కర్​ను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 2022లో మహబూబ్​నగర్​ ఎక్సైజ్​ పరిధిలో 44 ఫుల్​ బాటిళ్లు పట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. జడ్చర్ల ఎక్సైజ్​ పరిధిలో 2022లో 190 లీటర్ల లిక్కర్​ను స్వాధీనం చేసుకొని, 11 మందిపై కేసులు ఫైల్​ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 64 లీటర్ల లిక్కర్​ను పట్టుకొని నలుగురిపై కేసులు నమోదు చేశారు. 

పోలీసులు ఈ ఏడాది హన్వాడలో 2 లీటర్లు, మహబూబ్​నగర్​ రూరల్​లో రెండు విడతల్లో 7 ఫుల్​​బాటిళ్లు, నవాబ్​పేటలో 4 లీటర్లు, భూత్పూర్​లో లీటర్​ లిక్కర్​ను స్వాధీనం చేసుకొని 5 కేసులు నమోదు చేశారు. నాలుగు రోజుల కింద రూరల్​ పోలీస్​ స్టేషన్  పరిధిలో గోవా లిక్కర్​ను ప్రైవేట్​ ట్రావెల్స్ లో హైదరాబాద్​కు తరలిస్తున్న ఒకరిపై, రెండు రోజుల కింద ఒకరిపై కేసులు పెట్టారు. 

ఒక్క బాటిల్​ దొరికినా కేసు పెడ్తాం..

పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్  రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఐడీ లిక్కర్, నాన్​ డ్యూటీ పెయిడ్​ లిక్కర్​పై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇన్ఫర్మేషన్​ రాగానే తనిఖీలు చేసి లిక్కర్​ను పట్టుకుంటున్నాం. ఒక్క బాటిల్​ దొరికినా కేసు నమోదు చేస్తాం.

-కె నరసింహ, ఎస్పీ, మహబూబ్​నగర్​

చెక్​పోస్టులో తనిఖీలు చేస్తున్నాం..

కృష్ణ వద్ద ఉన్న బార్డర్​ చెక్​పోస్ట్​లో తనిఖీలు చేస్తున్నాం. డిపార్ట్​మెంట్​ నుంచి స్పెసిఫిక్​గా తనిఖీలు చేయమని ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. ఎస్పీలు, డిపార్ట్​మెంట్​ కమిషనర్​ల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు, ప్రతీ వెహికిల్​ను చెక్​ చేస్తాం. 

- వీరస్వామి, ఆర్టీవో, నారాయణపేట