గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. క్లబ్ లో సిలిండర్ పేలి.. 23 మంది మృతి..

గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. క్లబ్ లో సిలిండర్ పేలి.. 23 మంది మృతి..

గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఓ క్లబ్ లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. ఆదివారం ( డిసెంబర్ 7 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉత్తర గోవాలోని అర్పోరా లోని ఓ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవాలోని ప్రసిద్ధ బీచ్ లలో ఒకటైన బాగాలో బిర్చ్ బై రోమియో అనే క్లబ్ లో అర్థరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందినవారిలో నలుగురు కస్టమర్లు కాగా.. మిగతావారు క్లబ్ స్టాఫ్ అని సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. డీజీపీ సహా సీనియర్ పోలీస్ అధికారులు, ఉత్తర గోవా నుంచి పోలీస్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

అర్థరాత్రి సమయంలో ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో ఎక్కువమంది సిబ్బంది మరణించారని తెలిపారు పోలీసులు.గోవా సీఎం ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సీఎం ప్రమోద్ సావంత్. ఘటనపైవిచారణ జరుపుతామని.. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం ప్రమోద్ సావంత్.