
- కొనసాగుతున్న గోదావరి ఉధృతి
- సరస్వతి ఆలయాన్ని చుట్టుముట్టిన నీటి ప్రవాహం.. భక్తుల దారి మళ్లింపు
- జలమయమైన లాడ్జిలు, హోటళ్లు, దుకాణాలు
- పెద్ద ఎత్తున పంటలకు నష్టం
- పలు గ్రామాలకు చేరుకుంటున్న వరద
భైంసా, వెలుగు: గోదారమ్మ శాంతించలేదు. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్‌జిల్లా బాసర వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన గోదావరి ఉధృతి శనివారమంతా కొనసాగింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రధాన రోడ్డు మార్గంతో పాటు ఈ ప్రాంతం గుండా ఉన్న ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు జలమయమయ్యాయి.
వరద తాకిడి కారణంగా వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగింది. గోదావరి నుంచి వచ్చే రోడ్డు, రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వచ్చే మార్గం పూర్తిగా జలమయమైంది. సుమారు 10 అడుగుల మేర వరద చేరింది. టీటీడీ అతిథి గృహం, ఈవో ఆఫీస్, వ్యాస మహర్షి ఆలయం వరకు వరద తాకింది. బాసరలో రెండ్రోజులుగా వర్షం లేనప్పటికీ వరద రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మునిగిన ఇండ్లు, పంట పొలాలు
ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద రావడం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా బాసర జలదిగ్బంధమైంది. అటు ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు ఔట్‌ఫ్లో కింద 5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినప్పటికీ బాసరలో మాత్రం వరద తగ్గలేదు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లతోపాటు పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పొలాలు చెరువులను తలపించాయి. వేలాది ఎకరాల్లో పత్తి, సోయా పంటలు దెబ్బతినడంతో రైతులు బోరుమంటున్నారు. బస్సు, రైల్వే వంతెనలను తాకుతూ వరద పారింది.
దీంతో అధికారులు బాసర మీదుగా రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆర్యవైశ్య సత్రంలో ఉన్న భక్తులను శనివారం ఉదయం రెస్క్యూ సిబ్బంది, పోలీసులు బోటులో వెళ్లి బయటకు తీసుకొచ్చారు. ఆలయానికి సమీపంలో ఉన్న ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల లోపలికి వరద రావడంతో బ్యాంకు అధికారులు ఫైళ్లను కాపాడేందుకు ముప్పు తిప్పలు పడ్డారు.
పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ వరద ఆలయం వరకు చేరింది. దీంతో శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే రామారావు పటేల్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రవాహం, నష్టం, ఇతరత్రావివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడారు. నష్టం జరుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్అభిలాష అభినవ్ బాసరను సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. మండలంలోని బిద్రెల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేసి ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
గోదావరి నది మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తోందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక ఆలయ వసతి గృహంలో అధికారులతో రివ్యూ నిర్వహించి వరద ఉధృతి వివరాలు, నష్టం అంచనాలు తదితర వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ పవన్ చంద్రే, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.