గోదావరి... దేశంలో రెండో పెద్ద నది

గోదావరి... దేశంలో రెండో పెద్ద నది

గోదావరి నదిని వయస్సుపరంగా వృద్ధగంగా అని, పొడవు పరంగా దక్షిణ గంగ అని,  పాపికొండల మధ్య ప్రవహించే క్రమంలో ఏర్పడే సుందర మనోహర దృశ్యాల పరంగా ఇండియన్​ రైన్​ అని పిలుస్తారు. 

గోదావరి దేశంలో రెండో పెద్ద నది. ద్వీపకల్ప భారతదేశంలో పెద్ద నది. పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో సముద్రమట్టానికి 1067 మీటర్ల ఎత్తులో నాసిక్​ త్రయంబకేశ్వర్​ వద్ద జన్మించి, ఆగ్నేయ దిశగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల ద్వారా 1465 కి.మీ. పొడవున ప్రవహిస్తూ రాజమండ్రికి దిగువన బంగాళాఖాతంలో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పరీవాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ. ఇది భారతదేశ భూభాగంలో 1/10వ భాగాన్ని కలిగి ఉంది. 

ఉపనదులు: గోదావరి నదికి  ఎడమ ఒడ్డున కలిసే ఉపనదుల్లో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ప్రధానమైనవి. ఇవి గోదావరి బేసిన్​లో 59.7శాతం పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. కుడి ఒడ్డున కలిసే నదుల్లో ప్రవర, మంజీర, మానేరు నదులు ప్రధానమైనవి. ఇవి గోదావరి బేసిన్​లో 16.1శాతం ఆక్రమిస్తాయి. గోదావరి బేసిన్​లో ప్రాణహిత నది అతిపెద్ద పరీవాహక ప్రాంతాన్ని 34శాతం కలిగి ఉంది.  గోదావరి ఉపనదుల్లో పొడవైనది మంజీర.

పరివాహక ప్రాంతం

గోదావరి ఎగువ, మధ్య, దిగువ పరీవాహక ప్రాంతం – 24.2శాతం, ప్రాణహిత – 34.87శాతం, ఇంద్రావతి– 12.98శాతం, మంజీర– 9.86శాతం, శబరి– 6.53శాతం, పూర్ణ– 4.98శాతం, మానేరు– 4.18శాతం, ప్రవర– 2.08శాతం