
- శ్రీరాంసాగర్ కు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
మంచిర్యాల/గోదావరిఖని/నిర్మల్, వెలుగు : భారీ వర్షాల కారణంగా గోదావరితో పాటు దాని ఉపనదులు ఉధృతంగా పారుతున్నాయి. దీంతో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లకు సుమారు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఎస్సారెస్పీకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ల గేట్లను ఓపెన్ చేసి భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.
ఎల్లంపల్లి 20 గేట్లు ఓపెన్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం నుంచి 1.61 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 54,366 క్యూసెక్కులు కలిపి మొత్తం 2.15 లక్షల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.730 టీఎంసీలకు చేరుకుంది. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పది గేట్లు అర మీటర్ మేర ఎత్తి 26 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో ఆరు గంటలకు మరో 10 గేట్లు ఓపెన్ చేసి 54 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. తర్వాత 7 గంటలకు 80 వేలు, 7.30కి రెండు లక్షల క్యూసెక్కులను వదిలిన ఆఫీసర్లు 8 గంటలకు నీటి విడుదలను మూడు లక్షల క్యూసెక్కులకు పెంచారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా మత్స్యకారులు, పశువుల కాపరులు నదీ ప్రవాహం వైపు వెళ్లొద్దని చెప్పారు.
నిండుకుండలా కడెం
భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. శనివారం ఉదయం నుంచి గంటగంటకు పెరుగుతున్న వరద సాయంత్రానికి ఒక్కసారిగా 1,95,973 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు కడెం ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి 2,14,730 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వేర్వేరుగా ప్రాజెక్ట్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కాగా.. ప్రాజెక్ట్ దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ (45) అనే వ్యక్తి వరద ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎంత గాలించినా గంగాధర్ ఆచూకీ దొరకలేదు. స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి సైతం వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో ఆరు గేట్లను ఎత్తి 29,305 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడ్డన్న వాగులోకి కూడా వరద పెరగడంతో 20 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు.
శ్రీరాంసాగర్‌కు భారీ వరద
బాల్కొండ : గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. శనివారం ఉదయం 53 వేల క్యూసెక్కులుగా నమోదైన వరద.. మధ్యాహ్నం వరకు 75 వేలకు, సాయంత్రానికి 1,04,879 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా.. శనివారం సాయంత్రం వరకు 1083.30 అడుగుల (54.62 టీఎంసీలు)కు చేరుకుంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో ఎస్సారెస్పీ పూర్తిగా నిండనుందని ఆఫీసర్లు తెలిపారు.
శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కెనాల్‌కు 4 వేల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, అలీ సాగర్‌కు 180, మిషన్ భగీరథకు 231 నీటిని విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రంలోని 1, 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని డీఈ శ్రీనివాస్ తెలిపారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోకి మత్స్యకారులు, ప్రజలు, పశువుల కాపరులు వెళ్లొద్దని హెచ్చరించారు.
30 అడుగులకు చేరుకున్న గోదావరి
భద్రాచలం, వెలుగు : భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం గోదావరి నది 30 అడుగుల ఎత్తులో పారుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో గోదావరి ఎత్తు 33 అడుగులకు చేరే అవకాశం ఉందని ఆపీసర్లు చెబుతున్నారు. భద్రాద్రి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో గోదావరి తీరంలో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తి 8,362 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి వదులుతున్నారు.