మేళ్ల చెరువు గోడౌన్ ఓపెనింగ్‭లో టీఆర్​ఎస్​ లీడర్ల గొడవ

మేళ్ల చెరువు గోడౌన్ ఓపెనింగ్‭లో టీఆర్​ఎస్​ లీడర్ల గొడవ

మేళ్లచెరువు, వెలుగు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో గోడౌన్ ఓపెనింగ్​లో గొడవ జరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మండల కేంద్రంలో వెయ్యి టన్నుల సామర్థ్యంతో రూ.65.20 లక్షల ఖర్చుతో కట్టిన కొత్త గోడౌన్ ను శనివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన మీటింగ్​లో సైదిరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ‘‘టీఆర్ఎస్ హయాంలో రోడ్లు, నీళ్లు వచ్చాయి. గత పాలకులు టెయిల్ పాండ్లు ని ర్మించినా చుక్క నీళ్లు రాలేదు. వాళ్లు ఏ పని చేపట్టినా ఏండ్ల తరబడి పూర్తికాకపోయేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు” అని అన్నారు. అంతకుముందు డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.  

మేమూ గొడవ చెయ్యగలం: ఉత్తమ్ 

ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదు. రాజకీయ ఉపన్యాసాలు చేయడం తగదు. మీరు చెప్పిన అభివృద్ధి ఒక్కటే కాదు. మూడేండ్లుగా రైతులకు పంట బీమా అందడం లేదు. రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. ఇవి అమలయ్యేటట్లు సీఎం, ఎమ్మెల్యే చొరవ చూపాలి” అని కోరారు. ఈ క్రమంలో వేదిక పైనున్న మేళ్లచెరువు సొసైటీ చైర్మన్ శంభిరెడ్డి కలగజేసుకొని.. ‘‘మాకు రైతుబంధు వస్తుంది. ఇవేవీ అక్కర్లేదు” అన్నారు. ‘‘మీ మేలు గురించే మాట్లాడుతున్నాను” అని ఉత్తమ్ సమాధానమిచ్చారు. ఆ టైమ్​లో ఉత్తమ్ మాట్లాడుతుండగా అడుగడుగునా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. ‘‘పంట బీమా, రుణమాఫీ గురించి మాట్లాడొద్దా?’’ అని ఉత్తమ్ వారిని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి ఉత్తమ్ వేదిక దిగి వెళ్లిపోయారు.