జీవో 49ను రద్దు చేయాలి : గొడం గణేశ్

జీవో 49ను రద్దు చేయాలి : గొడం గణేశ్

ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్న జీవో 49ను రద్దు చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్ డిమాండ్​ చేశారు. సోమవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందించిన అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. 49 జీవో కారణంగా ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం జీవో రద్దు చేయకపోతే ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివాసీ గిరిజన సంఘాలు, తుడం దెబ్బ రాయ్ సెంటర్, రాజ్ గోండ్ సేవ సమితి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చారు. తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు, రాష్ట్ర నాయకులు జైవంత్ రావు, తిరుపతి, ఇంద్రవెల్లి రగల్ జెండా అధ్యక్షుడు తొడసం నాగోరావు తదితరులు పాల్గొన్నారు. 

తీర్మాన పత్రాల అందజేత

కాగజ్​నగర్, వెలుగు: జీవో నెంబర్ 49 రద్దు చేయాలని తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాగజ్​నగర్, కౌటాల​మండల కేంద్రాల్లోని ఫారెస్ట్ రేంజ్,  తహసీల్దార్ అఫీసుల్లో తీర్మాన పత్రాలు అందించారు. ఆదివాసీల ఆస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు తొలగించి,గ్రామాలను తరలించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తుడుం దెబ్బ జిల్లా , మండల నాయకులు, రాయి సెంటర్ సార్ మేడి లు పాల్గొన్నారు.

జీవో 49తో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకం

తిర్యాణి, వెలుగు: జీవో 49 తో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మ భగవంత్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తిర్యాణి, జైనూర్ మండలాల ఆదివాసీ సంఘాల నాయకులు తాహసీల్దార్, రేంజ్​ ఆఫీసుల్లో వినతి పత్రాలు సమర్పించారు. జీవో 49తో ఆదివాసీలు ఉపాధి కోల్పోతారని అన్నారు. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి జీవో లను తీసుకువచ్చిందని మండిపడ్డారు. 

ఆదివాసీలను అడవుల నుంచి గెంటేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్​చేశారు. తిర్యాణి, జైనూర్ ఆదివాసీ సంఘాల నాయకులు గెడం సుభాష్, పెందు ధర్ము, భాస్కర్, గోపాల్, సీతారాం  తదితరులు పాల్గొన్నారు.