పది నిమిషాల్లో రూ. 12 కోట్ల విలువైన బంగారం దోపిడీ

పది నిమిషాల్లో రూ. 12 కోట్ల విలువైన బంగారం దోపిడీ

కేవలం పదంటే పది నిమిషాల్లోనే దొంగలు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలో గురువారం జరిగింది. నలుగురు సాయుధ దుండగులు కటక్ పట్టణంలోని ప్రముఖ బ్యాంకింగ్ రహిత ఫైనాన్స్ సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శాఖ నుంచి రూ .12 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీ బంగారు రుణాలు, ఆస్తిని తనాఖాగా పెట్టుకొని రుణాలు ఇచ్చే ఒక ప్రధాన బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థ.

మాస్కులు, హెల్మెట్లు ధరించిన నలుగురు దుండగులు నాయసారక్‌లోని ఐఐఎఫ్ఎల్ బ్రాంచ్‌కి వచ్చి సెక్యూరిటీ గార్డును గన్‌తో బెదిరించి బ్రాంచ్ లోపలికి ప్రవేశించారని పోలీసు అధికారులు తెలిపారు. హిందీ మరియు ఒడియాలో మాట్లాడిన దుండగులు.. బ్రాంచ్ మేనేజర్‌ను మరియు ఇతర సిబ్బందిని టాయిలెట్‌లో బంధించి లాకర్ కీలను లాక్కొని ఈ లూఠీ చేశారని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కటక్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ప్రతీక్ సింగ్ తెలిపారు. కటక్ పట్టణ సరిహద్దులన్నీ మూసివేశామని.. కటక్‌కు ఆనుకొని ఉన్న జగత్సింగ్‌పూర్, జాజ్‌పూర్, ధెంకనాల్ మరియు కేంద్రపారా పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.

‘లాకర్‌లో 2-3 ప్యాకెట్ల బంగారం మినహా దాదాపు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ సంఘటన కేవలం 10 నిమిషాల్లోనే జరిగింది’ అని బ్రాంచ్ మేనేజర్ సత్య ప్రధాన్ అన్నారు. దోపిడీ జరిగినప్పుడు సీసీటీవీ కెమెరా పనిచేయలేదని ప్రధాన్ తెలిపారు.

ఒడిశాలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు ఈ దోపిడీ జరగడం సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. రాష్ట్రంలో ఈ ఏడాది బ్యాంకులు, ఏటీఎంలలో వరుస దోపిడీలు జరిగాయి. గత నెలలోనే బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా వ్యవస్థలను మెరుగుపరచాలని పోలీసు కమిషనరేట్ సూచించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఐఐఎఫ్ఎల్ యొక్క లూధియానా శాఖలోనూ ఇదే విధమైన దోపిడీ జరిగింది. అప్పుడు కూడా నలుగురు సాయుధ వ్యక్తులు ఆఫీసులోకి ప్రవేశించి రూ. 13 కోట్ల విలువైన 30 కిలోల బంగారం మరియు రూ. 3.5 లక్షల నగదు దోచుకొనిపోయారు.

For More News..

మారువేషంలోనైనా భాగ్యలక్ష్మి గుడికి చేరుకుంటా

గ్రేటర్ ఎలక్షన్: 56 మందితో నాలుగో లిస్టు విడుదల చేసిన బీజేపీ

రాష్ట్రంలో 50 లక్షలు దాటిన కరోనా టెస్టులు

యూట్యూబర్‌పై రూ. 500 కోట్ల పరువునష్టం దావా వేసిన అక్షయ్ కుమార్