- రికార్డు లెవెల్లో గోల్డ్ దిగుమతులు
- 160 టన్నుల గోల్డ్ వచ్చింది
- విలువ రూ. 80 వేల కోట్లు
- పండగ డిమాండ్‌పై అంచనాలతోనే
వెలుగు బిజినెస్ డెస్క్: మార్చి నెలలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ దిగుమతుల విలువ కిందటి నెలతో, అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే చాలా ఎక్కువయినట్లు డేటా చెబుతోంది. మార్చి 2021లో రూ. 80 వేల కోట్ల (10.94 బిలియన్ డాలర్లు) విలువైన బంగారం, ఇతర విలువైన స్టోన్స్ దిగుమతులు జరిగాయి. ఇందులో ఒక్క బంగారం దిగుమతులే తీసుకుంటే, అంతకు ముందు ఏడాది మార్చి కంటే 584 శాతం పెరిగి 7.17 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 2020లో గోల్డ్ దిగుమతులు 2.8 బిలియన్ డాలర్లు మాత్రమే.బడ్జెట్లో బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపుతోపాటు, పండగల సీజన్ దగ్గరపడుతుంటం వల్ల కూడా దిగుమతులు భారీగా పెరిగి ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీ ఆర్ సోమసుందరం అభిప్రాయపడ్డారు.
రేట్లు తగ్గడం ఓ కారణం...
మన దేశంలో బంగారం రేట్లు తగ్గడం కూడా దిగుమతులు పెరగడానికి కారణం కావచ్చన్నారు. మరోవైపు అక్షయ తృతీమ ఇంక నెలరోజులే ఉంది. ఈ టైములో సాధారణంగానే దిగుమతులు ఎక్కువవుతాయి. ఎందుకంటే ఇప్పుడే బంగారం కొని ఆభరణాల తయారీకి జ్యుయెలర్స్ రెడీ అవుతారు. కాకపోతే, మార్చి నెల దిగుమతుల డేటా బంగారం గ్రాస్ ఇంపోర్ట్స్ కి సంబంధించినది. ఇలా దిగుమతయిన దాంట్లో మళ్లీ కొంత ఎగుమతుల రూపంలో దేశం బయటకు వెళ్లే అవకాశం ఉంది. వాక్సినేషన్ ఇప్పుడిప్పుడే జరుగుతుండటం వల్ల దుబాయ్ మార్కెట్ ఇంకా పుంజుకోలేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అన్నారు.
జ్యువెలరీ ఇండస్ట్రీ బాగుంది...
దేశంలో బంగారం రేట్లు ఫిబ్రవరి నుంచి చూస్తే 7 శాతం తగ్గాయి. కిందటేడాది దిగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఈ మార్చి దిగుమతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశీయంగా జ్యువెలరీ పరిశ్రమ బాగా పనిచేస్తోందని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈడీ సవ్యసాచి రే చెప్పారు. గోల్డ్ రేట్లు బాగా తగ్గడంతో సేల్స్ పెరిగాయి. ఎందుకంటే, రేట్లు తక్కువ స్థాయిలో ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చునని రే పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో మళ్లీ ఇంపోర్ట్స్ నార్మల్ !
తాజా బడ్జెట్లో బంగారం, వెండిలపై ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. కాకపోతే, 2.5 శాతం సెస్ విధించారు. నెలవారీ దిగుమతుల డేటా కొంత కన్ఫ్యూజన్గా ఉందని ఒక ఆఫీసర్ అన్నారని రాయిటర్స్ రిపోర్టు చేసింది. మార్చి నెలలో ఇండియా 160 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుందని పేర్కొంది. సాధారణంగా మన గోల్డ్ ఇంపోర్ట్స్ నెలకు 60–70 టన్నుల దాకా ఉంటాయి. పండగ సీజన్లో ఇవి 90 టన్నుల దాకా పెరుగుతాయి. మార్చి నెలలో ఏకంగా 160 టన్నుల బంగారం దిగుమతవడం విశేషం.
