- డిమాండ్ పెరుగుతుండటమే ముఖ్యకారణం
న్యూఢిల్లీ: 2022–23 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈక్విటీ మార్కెట్లో విపరీతమైన ఆటుపోట్ల కారణంగా డిమాండ్ పెరిగింది. బలమైన రాబడిని అందించడంలో బంగారానికి తిరుగులేదు కాబట్టి గిరాకీ తగ్గడం లేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ, సెన్సెక్స్ చెప్పుకోదగ్గర లాభాలను ఇవ్వలేదు. దీంతో ఎక్కువ మంది బంగారంవైపు మొగ్గు చూపడంతో ధరలు 15శాతం పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బులియన్‌కు లాభదాయకంగా కనిపిస్తోంది. ఎక్స్పర్టుల అంచనాల ప్రకారం.. ధరలు15శాతం నుంచి 20శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో బంగారం తదుపరి స్థాయి ఏమిటి అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఈ ఏడాది జూన్ ఐదో తేదీకి మెచ్యూర్ అయ్యే ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల రేటు రూ.295 లేదా 0.49శాతం తగ్గి గతవారం రూ.59,600లకు చేరింది. ఫ్యూచర్స్ లో పది గ్రాముల ధరలు రూ.60,065 వరకు పెరిగాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర శుక్రవారం ఔన్స్‌కు 0.6 శాతం తగ్గి 1,968 డాలర్లకు చేరుకుంది. యూఎస్ ఫెడ్ ఈసారి వడ్డీ రేట్లను పెంచదన్న అంచనాల నేపథ్యంలో పెట్టుబడుదారులు బంగారం కోసం మరింత డబ్బును ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయమై ఎల్కేపీ సెక్యూరిటీస్‌లోని వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు రూ.52,000 నుంచి రూ.60,000 వరకు .. అంటే రూ.8,000 వరకు పెరిగాయని, ఇతర అసెట్ క్లాస్‌ల కంటే ఇది 15శాతం ఎక్కువ రాబడి ఇచ్చిందని వివరించారు. రష్యా– ఉక్రెయిన్‌ల వివాదం వంటి సమస్యల కారణంగా ప్రపంచమంతటా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఇక నుంచి కూడా బంగారం పోర్ట్ ఫోలియోలో పర్ఫెక్ట్ హెడ్జ్ అని, బలమైన రాబడిని ఇస్తుందని జతిన్ వివరించారు.
పెట్టుబడులకు బెస్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గోల్డ్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా కనిపిస్తోందని ఎనలిస్టులు అంటున్నారు. "ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగానే ఉన్నందున భద్రత కోణం నుంచి చూసినా, ఆర్ఓఐ పరంగా చూసినా బంగారం లాభదాయకంగా ఉంది. వడ్డీరేట్లు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరలు 10–-15 శాతం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి” అని జతిన్ త్రివేదీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు బంగారం ధరలు సులభంగా రూ.66,000–-68,000 రేంజ్ వరకు వెళ్లొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ అభిప్రాయపడింది. ఈక్విటీ వంటి రిస్కీ అసెట్స్ పనితీరు బాగా లేనందున గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చింది. ఈ సంస్థ ఫౌండర్ రాహుల్ జోసెఫ్ మాట్లాడుతూ, “భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, కరెన్సీలో హెచ్చుతగ్గులు, బంగారానికి డిమాండ్‌లో, సరఫరాలో మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. ఇండియాలో బంగారానికి డిమాండ్ బలంగా ఉంది. పసిడికి సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో దీనిని భారీగా కొంటారు. చాలా మందికి దీనిని సురక్షితమైన ఆస్తిగా చూస్తారు. బంగారానికి ఇన్ఫ్లేషన్, కరెన్సీ విలువ తగ్గింపు వంటి సమస్యలు ఉండవు. కిందటివారం ధరలు కొంచెం తగ్గినా ఇక నుంచి మాత్రం పెరిగే అవకాశాలే ఎక్కువ”అని ఆయన స్పష్టం చేశారు.
