బంగారం ధర… మళ్లీ రికార్డు బ్రేక్

బంగారం ధర… మళ్లీ రికార్డు బ్రేక్

10 గ్రాములు రూ.55,045.. కేజీ వెండి రూ.70 వేల పైన

గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ర్యాలీ

2,000 డాలర్ల మార్క్‌ దాటేసింది

న్యూఢిల్లీ: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ రికార్డులు బ్రేక్ చేశాయి. ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్‌లో, గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర సరికొత్త గరిష్ట మార్క్ రూ.55, 045ను తాకింది. రూ.55 వేల మార్క్‌ను దాటడం ఇదే మొదటిసారి. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం పెరిగి కేజీ రూ.70,422కు ఎగిసింది. అం తకు ముందు సెషన్‌లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ఇంట్రాడేలో రూ.900 మేర పెరిగి, రూ.54,612 ను తాకింది. సిల్వర్ ధర రూ.4,200 మేర పెరిగింది. గ్లోబల్‌గా గోల్డ్ రేట్లు ర్యాలీ చేస్తుండటంతో, దేశంలో వీటి ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు 2,000 డాలర్ మార్క్ ‌ను దాటాయి. డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రభుత్వాలు మరిన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటిస్తాయని అంచనాలు ఉండటం వంటివి బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్ కు 2,022.42 డాలర్లుగా నమోదైంది. సెషన్ ప్రారంభంలో ఈ ధర 2,030 డాలర్లను తాకింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి 2,039 డాలర్లుగా ఉన్నాయి. సిల్వర్ కూడా 0.5 శాతం ఎగిసి ఒక ఔన్స్‌ 24.88 డాలర్లు గా రికార్డు అయింది. ప్లాటినం మాత్రం 0.9 శాతం తగ్గి 928.95 డాలర్లకు పడిపోయింది.

గ్లోబల్ మార్కెట్లలో 33శాతం జంప్…

గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు ఈ ఏడాది 33 శాతం వరకు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌‌ల్లోకి రికార్డు ఇన్‌‌ఫ్లోలు రావడంతో గోల్డ్ ధరలు బాగా ప్రయోజనం పొందుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌‌ల నుంచి కూడా ఊహించని స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తున్నాయి. వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాయి. దీంతో గోల్డ్ ధర పైపైకి చూస్తోంది. ఐదేళ్ల యూఎస్ ట్రెజరీ ఈల్డ్ రికార్డు కనిష్టానికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.3 శాతానికి పడిపోయింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే.. గోల్డ్ తక్కువ ఖరీదైనదిగా మారింది. ప్ర పంచంలో అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఈటీఎఫ్‌ ‌ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ 0.8 శాతం పెరిగి, 1,257.73 టన్నులకు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతూ గ్లోబల్ ఎకానమీకి మరిన్ని ఛాలెంజస్ ఎదురవు తుండటంతో, గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ప్రజలు గోల్డ్‌‌ వైపు ఎక్కువగా చూస్తున్నారని కొటక్ సెక్యూరిటీస్ తన నోట్‌లో పేర్కొంది. గ్లోబల్‌గా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని, మళ్లీదేశాలు ఆంక్షలు విధించాల్సి వస్తుందని తెలిపింది.

స్పాట్ గోల్డ్ రూ.56 వేలపైనే

స్పాట్ గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధానిలో 10గ్రాముల స్పాట్ గోల్డ్ ధర రూ.1,365 పెరిగి రూ.56,181 వద్దకు చేరుకుంది. గ్లోబల్‌ మార్కెట్‌లో స్ట్రాంగ్ ర్యాలీతో స్పాట్ గోల్డ్ ధర రూ.56 వేల పైకి చేరుకుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. సిల్వర్ రేట్లు కూడా కేజీకి రూ.5,972 పెరిగి రూ.72,726కు ఎగిశాయి. అంతకు ముందు ట్రేడ్‌లో కేజీ వెండి రూ.66,754గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10గ్రాముల స్పాట్ గోల్డ్ ధర రూ.55,580గా ఉంది. 24క్యారెట్ల ధర రూ.56,720కు ఎగిసింది.