బంగారం ధర... ఆల్ ​టైం హైకి?

బంగారం ధర... ఆల్ ​టైం హైకి?

న్యూఢిల్లీ: బంగారం ధర ఇక ముందు పెరగడం తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్యాలెండర్​ సంవత్సరంలో ఆల్​టైం హైకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా పసిడి ధరలు పైపైకి వెళ్తూనే ఉన్నాయి.  2022 అక్టోబర్ నుండి దేశంలో బంగారం ధర దాదాపు 16 శాతం పెరిగింది. పది గ్రాములకు రూ.50,760 నుంచి రూ.58,800 కి పెరిగింది. దీనిని బట్టి చూస్తే దీర్ఘకాలిక రిటర్న్ లకు ఇది అనువైనదని అంటున్నారు. అయితే 2022లో బంగారం ధరలు విపరీతంగా ఆటుపోట్లకు గురయ్యాయి. పెట్టుబడిదారులు అయోమయానికి గురయ్యారు. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాగానే బంగారంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఇతర వస్తువుల ధరలూ (ఇన్​ఫ్లేషన్​) ఎక్కువయ్యాయి. 

ఎకనమిక్​ స్లోడౌన్​, ఇన్​ఫ్లేషన్​ ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితి కొద్దికాలమే కనిపించింది. ధరలు మళ్లీ పడిపోయాయి. రియల్టీ జోరు తగ్గినా బంగారం ధరలు పెరగలేదు.  యూఎస్​ ఫెడ్​ రిజర్వ్​ రేట్లను పెంచడం ఇందుకు మరో కారణం. చైనాలో చాలాకాలం పాటు కరోనా లాక్​డౌన్స్​ విధించడం వల్ల గోల్డ్​కు డిమాండ్​తగ్గింది. పోయిన ఏడాది అక్టోబరులో పసిడి ధరలు దాదాపు 22 శాతం తగ్గాయి. అయితే సంవత్సరాంతం వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. గోల్డ్ ధరలు ఊపందుకున్నాయి. యూఎస్​ ట్రెజరీ యీల్ట్స్​, డాలర్​ విలువ తగ్గడంతో బంగారంలో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. చైనా నుంచి మళ్లీ డిమాండ్​ రావడం మొదలయింది. సెంట్రల్​ బ్యాంకులు విపరీతంగా కొన్నాయి. 

యూఎస్​ ఫెడ్​ నిర్ణయం కీలకం..

ఇలాంటి కారణాల వల్ల ఇక ముందు కూడా బంగారానికి గిరాకీ కొనసాగవచ్చని బులియన్​ ఎక్స్​పర్టులు అంటున్నారు. యూఎస్​ ఫెడ్ ​నిర్ణయాలు ఇక మీదట బంగారం ధరలను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని క్యాంటమ్​ఏఎంసీ సీఐఓ చిరాగ్​ మెహతా అన్నారు. ఇన్​ఫ్లేషన్​తగ్గుతున్నదని అనుకోబట్టే యూఎస్​ ఫెడ్​ ఈసారి వడ్డీరేట్లను  25 బేసిస్ పాయింట్లు  మాత్రమే పెంచిందని అన్నారు. ఇక నుంచి వడ్డీరేట్ల విషయంలో దూకుడుగా ఉండకపోవచ్చని చెప్పారు. రేట్లను పెంచడం పూర్తిగా ఆపితే బంగారం ధరలు బాగా పెరుగుతాయని మెహతా వివరించారు. గ్లోబల్​ స్లౌడౌన్​ఇలాగే కొనసాగితే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. సాధారణంగా రెసిషన్​ సమయాల్లో పుత్తడికి ఎక్కువ డిమాండ్​ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏడుసార్లు రెసిషన్​ రాగా, ఐదుసార్లు బంగారంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్​ఫ్లేషన్​ పెరిగినా బంగారానికి డిమాండ్​ పెరుగుతుంది. స్టాక్స్​, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ఢోకా లేదని చెప్పవచ్చు. అమెరికాలో రెసిషన్​ వస్తే గోల్డ్​కు డిమాండ్ ​అమాంతం పెరుగుతుందని మెహతా అన్నారు. ఇక ముందు గోల్డ్ ధర ఎప్పుడు తగ్గినా కొని పెట్టుకోవడం మంచిదని మిరాయి అసెట్స్​ ఏఎంసీ సూచించింది.