Gold: 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2 లక్షలు చేరటం పక్కా..! ర్యాలీ కారణాలివే..

Gold: 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2 లక్షలు చేరటం పక్కా..! ర్యాలీ కారణాలివే..

Gold Rise: దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 2025లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు స్పాట్ మార్కెట్లో రూ.లక్ష17వేల 500కి చేరింది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పండుగ సీజన్ డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల బంగారం షాపింగ్ వంటి అనేక కారణాలు రేట్ల పెరుగుదలకు కారణమయ్యాయి.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు..
* అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు సంకేతాలతో.. డాలర్ బలహీనమవుతుందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఆకర్షణ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
* భారత్‌లో పండుగ సీజన్ ప్రారంభమవడంతో కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి.
* భారత రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ నిల్వలను పెంచుకోవడం.
* రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు బంగారం సేకరణ పెంచడం.
* ట్రంప్ టారిఫ్స్ యుద్ధం తర్వాత పెరుగుతున్న ఆర్థిక భౌగోళిక వాణిజ్య పరిణామాలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. 

అనేక దశాబ్ధాలుగా ప్రజలు ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుత గ్లోబల్ ఆందోళనలు, ద్రవ్యోల్బణం, అలాగే ఈటీఎఫ్స్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పెట్టుబడులు బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ పెరుగుదల కారణంగా గోల్డ్ రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. దీనికి తోడు భారీగా బంగారం దిగుమతులు పెరగడం వలన కరెంటు అకౌంట్ లోటు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒకవేళ తాత్కాలికంగా గోల్డ్ రేట్లు పడిపోయినప్పటికీ భవిష్యత్తులో రేట్ల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వచ్చే 5 ఏళ్లలో గోల్డ్ పరిస్థితి ఇదే.. 
ద్రవ్యోల్బణం, భౌగోళిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, కొత్త మైనింగ్ టెక్నాలజీల వంటి అంశాలు బంగారం ధరలకు మద్దతు ఇస్తాయి. ఇకపై ప్రతి ఏటా ధరలు క్రమంగా పెరిగి 2029 నాటికి 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రేటు రూ.లక్ష63వేల నుంచి రూ.లక్ష 95 వేలకకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మెుత్తానికి చిన్నపాటి సవరణలు ఉన్నా, బంగారం పెట్టుబడిదారులకు సురక్షితమైన, లాభదాయకమైన ఎంపికగా కొనసాగుతుందని తెలుస్తోంది.

కేజీ బంగారం రేటుతో ఏ కారు వచ్చేదో తెలుసా..?
1990లో కేజీ బంగారం రేటుకు మారుతీ 800 కారు వచ్చేది అయితే 2000 సంవత్సరంలో కేజీ రేటుకు ఎస్టీమ్ కారు వచ్చింది. ఇక 2005లో కేజీ గోల్డ్ రేటుతో ఇన్నోవా కారు రాగా.. 2010 నాటికి పెరిగిన ధరతో కేజీ గోల్డ్ రేటుకు ఫార్చునర్ కారు కొనొచ్చు. ఇక 2019లో కేజీ బంగారం రేటుకు ఒక బీఎండబ్ల్యూ ఎక్స్ 1 కారు వచ్చింది. ప్రస్తుతం 2025లో కేజీ గోల్డ్ రేటు రూ.కోటి 17 లక్షలకు చేరటంతో డిఫెండర్ కారు వస్తోంది. అయితే భవిష్యత్తులో 2030 నాటికి గోల్డ్ రేట్ల ర్యాలీ కారణంగా కేజీ బంగారానికి వెచ్చించాల్సిన డబ్బుకు ఒక రోల్స్ రాయిస్ కారు కొనొచ్చని భావిస్తున్నారు. ఇక 2040 నాటికి కేజీ బంగారం రేటుకు ఒక ప్రైవేట్ జెట్ రావొచ్చని అంచనాలు ఉన్నాయి.