
అందరికీ రాఖీ పండుగ.. దొంగలకు మాత్రం లూటీ పండుగగా మారింది. ఇండ్లకు తాళాలేసి రాఖీ కట్టేందుకు వేరే ఊర్లకు వెళ్లిన వారి ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు.. భారీ ఎత్తున చోరీ చేశారు. ఇంటికి వచ్చే సరికి ఇల్లు గుల్ల చేసి దాచిపెట్టిన బంగారంతో పాటు భారీ ఎత్తున నగదుతో ఉడాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం (ఆగస్టు 09) ఒక్కరోజే 10 ఇండ్లు దోపిడీకి గురికావడం కలకలం రేపింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రం లక్ష్మీ నగర్ కాలనీలోని 10 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. తాళాలు పగలగొట్టి బీరువాలు, పెట్టెలు ధ్వంసం చేసి సుమారు 30 తులాల బంగారు నగలు, భారీగా నగదు ఎత్తుకెళ్లారు. రూ.30 లక్షల విలువైన బంగారంతో పాటు భారీగా నగదుతో పారిపోయారు. పండగ పూట ఎవరూ లేకపోవడంతో ఇళ్ళలో చోరీలకు ప్లాన్ చేసి భారీ ఎత్తున కమాయించారు దొంగలు.
ఇండ్లకు తాళాలు వేసి ఊరెళ్లిన బాధితులు.. ఆదివారం (ఆగస్టు 10) ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.