
అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో RRR చిత్రం నుంచి నాటు నాటు పాటకు అవార్డ్ వరించడంపై హీరో రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్, స్టైలిష్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
నాటు నాటు పాట చిత్రీకరణ సమయంలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అని రెడ్ కార్పెట్ దగ్గర అడగ్గా హీరో రామ్ చరణ్ స్పందిస్తూ ..దాని గురించి మాట్లాడటానికి ఇప్పటికీ తన మోకాళ్లు వణుకుతున్నాయని చెప్పారు . తాను, జూనియర్ ఎన్టీఆర్ చేసిన అత్యంత కష్టతరమైన సాంగ్ అని తెలిపారు. దానికి కచ్చితంగా ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నానని తెలిపారు. అది అందమైన టార్చర్. ఆ కష్టం, ఆ విధానం, లుక్ మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాయన్నారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన మాట్లాడుతూ ఇండియా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు ప్రయాణం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని చెప్పారు. దర్శకుడు రాజమౌళి, RRR చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌లో షూటింగ్ నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు వచ్చిన విధానం తనకు చాలా నేర్పింపించిందన్నారు. స్పష్టమైన ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ప్రతిఫలాన్ని ఇస్తాయని స్పష్టం చేశారు.