
దిల్ సుఖ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో స్వర్ణకారులు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చంపాపేట లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కరువై గోల్డ్స్మిత్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విశ్వబ్రాహ్మణులు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 ఏళ్లు నిండిన స్వర్ణకారులకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గౌరోజు రత్నమాచారి, ఉపాధ్యక్షుడు రామదాసు లక్ష్మణాచారి, రాష్ట్ర కార్యదర్శులు రాగిఫణి సతీశ్చారి, వింజమూరి వెంకటాచారి పాల్గొన్నారు.