గొర్రెల పంపిణీకి మళ్లీ బ్రేక్.. రాష్ట్ర సర్కారుపై గొల్లకురుమల ఫైర్

గొర్రెల పంపిణీకి మళ్లీ బ్రేక్.. రాష్ట్ర సర్కారుపై గొల్లకురుమల ఫైర్
  • స్కీమ్ మళ్లీ మళ్లీ ఆపుతుండటంపై అసంతృప్తి
  • ఎలక్షన్స్ ఉంటేనే ఇస్తరా అని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 'గొర్రెల పంపిణీ' స్కీమ్ మళ్లీ ఆగిపోయింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అనౌన్స్‌‌మెంట్ రాగానే గొర్రెల పంపిణీ ఆపాలని అన్ని జిల్లాల ఆఫీసర్లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరగడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలకు ముంగట కూడా ఇలాగే గొర్రెల పంపిణీ ప్రారంభించిన సర్కార్.. ఎన్నికలు ముగియగానే స్కీమ్ ఆపేసింది. జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో ఇటీవలే రెండో విడత గొర్రెల పంపిణీని పునర్ ప్రారంభించారు. అయితే, నెల రోజులు కూడా తిరగకుండానే స్కీమును సర్కార్ మళ్లీ ఆపేసింది. దీంతో ప్రభుత్వంపై గొల్ల కురుమలు మండిపడుతున్నారు. ఎన్నికలు ఉంటేనే గొర్లు ఇస్తరా అని ఫైర్ అవుతున్నారు.

అప్పులకు వడ్డీలు ఎక్కువైతున్నయ్

గొర్రెలు వస్తాయన్న ఆశతో చాలా మంది అప్పులు తీసుకొచ్చి లబ్ధిదారు వాటా కింద చెల్లించాల్సిన రూ.43,750 బ్యాంకుల్లో కట్టి డీడీలు తీశారు. ఇప్పుడు పంపిణీ ఆపేయడంతో అప్పులు తీసుకొచ్చిన యాదవులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి విడత గొర్రెల పంపిణీ సమయంలోనూ సర్కార్ ఇదే విధంగా వ్యవహరించింది. దీంతో అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయనిగానీ గొర్రెలు మాత్రం ఇవ్వడం లేదని గొల్లకురుమలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా రోడ్ల మీదకు వస్తామని యాదవ సంఘాల నేతలు సర్కార్‌‌‌‌ను హెచ్చరిస్తున్నారు.

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

గొర్రెల పంపిణీ స్కీమ్‌‌తో గొల్లకురుమలు లక్షాధికారులు అవుతున్నారని సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఒక్కో యూనిట్ కాస్ట్‌‌ను రూ.1.75 లక్షలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందులో లబ్ధిదారు వాట పేరిట 43,750 రూపాయలను కట్టించుకుంటున్నది. గవర్నమెంట్‌‌ తన వాటా కింద రూ.1,31,250 ఇస్తున్నది. ఇందులో రూ.6500 గొర్రెల రవాణాకు, రూ.3500 దాణాకు, రూ.5 వేలు ఇన్సూరెన్స్‌‌కు, రూ.500 మందులకు, ఇతర ఖర్చులకు రూ.1500 చొప్పున కేటాయించింది. ఇవేవీ లబ్ధిదారులకు చేరడం లేదు. పైగా గొర్రెల కొనుగోలు కోసం లబ్ధిదారులను ఏపీ, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు. పోయిరాను  ఖర్చులంతా యాదవులే భరిస్తున్నారు.

వేరే రాష్ట్రాల దళారులకే లాభం..

తెలంగాణ నుంచి వేల మంది గొర్ల కొనుగోలుకు వస్తుండడంతో ఇతర రాష్ట్రాల్లో దళారులు తయారయ్యారు. వీరి వద్ద మాత్రమే గొర్రెలు ఉండటంతో చేసేదేమీ లేక బక్కచిక్కిన, అనారోగ్యంతో ఉన్న గొర్రెలను కొనుగోలు చేయక తప్పడం లేదు. ఈ గొర్రెలు బతికే చాన్స్ తక్కువగా ఉండడంతో లబ్ధిదారులు తిరిగి ఆ దళారులకే గొర్రెలను అమ్ముతున్నారు. దళారులు ఒక్కో యూనిట్‌‌కు రూ.90 వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతో లబ్ధిదారునికి తాను కట్టిన వాటా డబ్బులు పోను కేవలం రూ.40 నుంచి 45 వేల వరకే మిగులుతున్నాయి. సర్కార్ తెచ్చిన ఈ స్కీమ్ వల్ల మన రాష్ట్ర గొల్ల కురుమల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన దళారులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. ఈ దళారులతో మన రాష్ట్ర అధికారులు, బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు కుమ్మక్కైనట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో మార్పులు తీసుకొచ్చి, లబ్దిదారులకే నగదు చెల్లించాలని గొల్ల కురుమలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు గొల్ల కురుమల డిమాండ్‌‌కు ఒప్పుకున్న సర్కార్‌‌..ఆ నియోజకవర్గంలోని కొంత మందికి  చెక్కులు ఇచ్చింది. ఎన్నికలు ముగియగానే స్కీమ్‌‌ను ఆపేసింది.