దవాఖాన నుంచి వెళ్లిపోయి.. పొదల్లో డెడ్ బాడీగా తేలిండు

దవాఖాన నుంచి వెళ్లిపోయి.. పొదల్లో డెడ్ బాడీగా తేలిండు

యూపీలో కరోనా పేషెంట్ అనుమానాస్పద మృతి

హాస్పిటల్ సిబ్బందే కారణమన్న కుటుంబ సభ్యులు

 ప్రయాగ్ రాజ్ (యూపీ): అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ సర్కారీ దవాఖానాలో జాయిన్ అయ్యిండు. ఏమైందో ఏమో గానీ.. అకస్మాత్తుగా దవాఖాన నుంచి వెళ్లిపోయిండు. 24 గంటల తర్వాత దవాఖానకు అర కిలోమీటర్ దూరంలోని పొదల్లో డెడ్ బాడీగా కనిపించిండు. యూపీలోని  ప్రయాగ్ రాజ్ సిటీలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ల ఆ కరోనా పేషెంట్ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం హాస్పిటల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే, హాస్పి టల్ సిబ్బంది నిర్లక్ష్యం, వేధింపుల వల్లే అతను వెళ్లిపోవాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దవాఖాన నుంచి వెళ్లిపోయే ముందు శనివారం ఉదయం అతడు తమకు ఫోన్ చేశాడని, తనను హాస్పిటల్లో ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పాడని కుటుంబ సభ్యులు ఓ ఆడియో క్లిప్ ను బయటపెట్టారు.

‘‘రాత్రంతా నా నోరు ఎండిపోయింది. వెంటిలేటర్ లేకపోవడం వల్ల ఊపిరి ఆడడం లేదు. నా పరిస్థితి గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని అతడు చెప్పినట్లు ఆడియోలో ఉంది. అలాగే అతడు శనివారం సాయంత్రం కొవిడ్ వార్డు గేటు నుంచి వెళ్లడం, అతని వెంటే కొందరు సిబ్బంది కూడా బయటికి వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కన్పించింది. వారు హాస్పిటల్ సిబ్బందేనని, ఆ పేషెంట్ ను తీసుకురావడానికే వెళ్లారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ‘‘ఆ పేషెంట్ కు జ్వరం, శ్వాస ఇబ్బంది ఉన్నాయి. అతడి పరిస్థితి మెరుగవుతోంది. కానీ సడెన్ గా వెళ్లిపోయాడు. డాక్టర్లు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. దీనిపై మేం వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాం. ఇందులో హాస్పిటల్ నిర్లక్ష్యం ఏమీలేదు’’ అని హాస్పిటల్ ప్రిన్సి పాల్ డాక్టర్ ఎస్పీ సింగ్ చెప్పారు.