3నెలల గ్యాప్​ తర్వాత మొదలవుతున్న పెండ్లి సందడి

3నెలల గ్యాప్​ తర్వాత మొదలవుతున్న పెండ్లి సందడి
  • మళ్లీ జనవరి 24 తర్వాతే మంచి ముహూర్తాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే నెల 2 నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో వధూవరులు ఒక్కటికానున్నారు. మూఢాల వల్ల మూడు నెలల పాటు పెద్దగా ఎక్కడ కూడా పెండ్లిళ్లు జరగలేదు. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు వస్తుండడంతో పేరెంట్స్​ తమ పిల్లల లగ్గాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫంక్షన్​ హాల్స్​ బుక్​ చేసుకుంటున్నారు. 

ఈ నెల 30 వరకు మూఢాలు

కార్తీక మాసం మంగళవారంతో ముగిసింది. గురువారం నుంచి మార్గశిర మాసం స్టార్ట్ అయింది. ఈ నెల 30 వరకు మూఢాలు ఉంటాయని పురోహితులు చెప్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 21 వరకు శుభ ముహూర్తాలు ఉంటాయని అంటున్నారు. డిసెంబర్ 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో వేల సంఖ్యలో పెండ్లిళ్లు జరుగుతాయని, ఇప్పటికే చాలా మంది డేట్స్​ను ఫిక్స్​ చేసుకున్నారని పురోహితులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పెండ్లిళ్లు జరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో మూఢాల వల్ల లగ్గాలు జరగలేదు. అప్పటి నుంచి మంచి ముహూర్తాలు లేకపోవటంతో 3 నెలలపాటు పెండ్లిళ్లకు బ్రేక్  పడింది. 

కోట్ల బిజినెస్ 

వచ్చే నెలలో పెండ్లి ముహూర్తాలు ఉండటంతో వందల కోట్ల వ్యాపారం జరగనుంది. షాపింగ్ మాల్స్, క్యాటరింగ్, పూలు, గోల్డ్ షాపులు, బ్యాండ్ మేళం, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్ మెంట్, పెండ్లి కార్డుల ప్రింటింగ్ ప్రెస్ లు.. ఇట్లా  అన్ని చోట్ల రద్దీ పెరగనుంది.   

ఇన్నాళ్లూ ఆగినవాళ్లు ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నరు

ఇన్నాళ్లూ శుభముహూర్తాల కోసం ఆగిన వాళ్లు, విదేశాల నుంచి లగ్గాల కోసం వచ్చిన వాళ్లు ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రిస్మస్​ టైమ్​లో ఫారెన్​లో సెలవులు ఉన్నం దున అక్కడున్న మనోళ్లు ఈ టైమ్​లో పెండ్లి ళ్లకు మొగ్గు చూపుతుంటారు.

గ్రామాల్లో వ్యవసాయ పనులతో రైతులు తీరిక లేకుండా ఉన్నందున  రైతుల కుటుంబాల్లో ఎక్కు వగా జనవరి 24 తర్వాత వచ్చే ముహూర్తాల్లో లగ్గాలు జరుగుతుంటాయి. గురువారం నుంచి వచ్చే నెల 23 వరకు మార్గశిర మాసం ఉంటుంది. వచ్చే నెల 2 నుంచి 21 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి పూర్తయితే జనవరి 24 నుంచి  జూన్ వరకు వరుసగా లగ్గాలు ఉన్నాయి. - బాలాజీ , పురోహితుడు, ఖమ్మం