ఎయిర్​పోర్టు ప్రయాణికులకు గుడ్​ న్యూస్

ఎయిర్​పోర్టు ప్రయాణికులకు గుడ్​ న్యూస్

హైదరాబాద్, వెలుగు: రోజూ శంషాబాద్​ఎయిర్​పోర్టు రూట్​లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు గుడ్​న్యూస్​చెప్పారు. రూ.5 వేలకే పుష్పక్ ఏసీ మంత్లీ జనరల్ బస్​పాస్ ను అందిస్తున్నట్లు తెలిపారు. ఏఎం, ఏఎల్, ఏజీ రూట్లలో శంషాబాద్, ఆరాంఘర్, గచ్చిబౌలి, బాలాపూర్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ నుంచి తక్కువ ధరకు పుష్పక్ ఏసీ పాస్ ను అందిస్తున్నట్లు టీజీ ఎస్ ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, గ్రీన్ మెట్రోలగ్జరీ ఏసీ మంత్లీ బస్ పాస్ ను రూ.1,900కు అందిస్తున్నామని పేర్కొన్నారు. సికింద్రాబాద్,- పటాన్​చెరు(219 రూట్), బాచుపల్లి,- వేవ్ రాక్ వయా జేఎన్ టీయూ(195 రూట్), కోఠి, కొండాపూర్ వయా లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మాదాపూర్, హై టెక్ సిటీ(127కే రూట్) రూట్లలో నడిచే బస్సుల్లో ఈ పాస్​చెల్లుతుందన్నారు. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనే కాకుండా ఈ–మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ సిటీ సబర్బన్ లిమిట్స్ వరకు ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. అయితే మెట్రో ఏసీ లగ్జరీ బస్​పాస్​ఎయిర్ పోర్టుకు తిరిగే పుష్పక్ ఏసీ బస్సుల్లో చెల్లుబాటు కాదని చెప్పారు. ఈ పాసులు గ్రేటర్ హైదరాబాద్ జోన్ లోని అన్ని బస్సు పాస్ కేంద్రాల్లో పొందొచ్చని,  ఉదయం 06.30 నుంచి రాత్రి 08.15 గంటలకు కౌంటర్లు తెరిచి ఉంటాయని వెల్లడించారు.