నల్గొండ అర్బన్, వెలుగు: ఈ నెల 25న సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జాబ్ మేళాపై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్‌జీ కాలేజీ స్టూడెంట్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. మంగళవారం మెగా జాబ్ మేళాపై సంబంధిత అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హుజూర్ నగర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనక వైపున ఉన్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే మెగా జాబ్ మేళాకు 150 కంపెనీలు 3 వేల నుంచి 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ ఉత్తీర్ణులైన 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువత 5 రెజ్యూమ్ కాపీలు,2 కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.
క్యూ ఆర్ కోడ్ ద్వారా జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో టిఫిన్, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, సతీశ్, ఎన్‌జీ కాలేజీ ప్రిన్సిపల్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, డీఈవో తదితరలు పాల్గొన్నారు.
