కొన్ని రాష్ట్రాల్లో పక్కా ప్లాన్​ .. ఇంటికే ఆక్సిజన్, మెడికల్​ కిట్​, ఆక్సిమీటర్లు

కొన్ని రాష్ట్రాల్లో పక్కా ప్లాన్​ .. ఇంటికే ఆక్సిజన్, మెడికల్​ కిట్​, ఆక్సిమీటర్లు

కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేలా చర్యలు
కొరత లేకుండా బెడ్ల ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు
లాక్​డౌన్​, కఠిన ఆంక్షలతో తగ్గుతున్న కేసులు


హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: కరోనా సెకండ్​ వేవ్​పై అప్రమత్తంగా ఉన్న రాష్ట్రాలు మెల్లమెల్లగా కోలుకుంటున్నాయి. అదమరిచి, పట్టింపు లేకుండా ఉన్న రాష్ట్రాలు ఆపదలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికీ అంతా కంట్రోల్​లో ఉందన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఇప్పటికే 14 రాష్ట్రాలు పూర్తిగా లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీకెండ్ ​లాక్​డౌన్​ విధించారు. సెకండ్​ వేవ్​ నుంచి ప్రజలను కాపాడేందుకు కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్న తీరు, అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు రోల్​మోడల్​గా నిలుస్తున్నాయి. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీటింగ్​తోపాటు వ్యాక్సినేషన్​ను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 18 ప్లస్​ ఏజ్​ గ్రూప్​ వాళ్లకూ టీకా వేస్తున్నారు. ఒడిశా, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కరోనాను పకడ్బందీగా కంట్రోల్​ చేస్తున్నాయి.  బాధితులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆక్సిజన్​, మందుల కొరత లేకుండా చూస్తున్నాయి. బ్లాక్​ మార్కెట్​కు చెక్​ పెడుతున్నాయి.
ఢిల్లీలో ఇంటికే ఆక్సిజన్
సెకండ్​ వేవ్​ స్పీడందుకోగానే ఢిల్లీ రాష్ట్ర సర్కారు ముందుగా లాక్​డౌన్​ ప్రకటించింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  అక్కడ కొవిడ్​ బాధితులకు ఫ్రీగా అందించే మెడికల్​ కిట్​లో అవసరమైన మెడిసిన్​ తో పాటు, పల్స్ ఆక్సిమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇస్తున్నారు. కొంత ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. ఒక్కటొక్కటిగా సమస్యలకు చెక్ పెడుతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 25 వేల కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 19 న వీకెండ్ కర్ఫ్యూ, లాక్​డౌన్​ ప్రకటించారు. సోమవారం వరకు లాక్​డౌన్​ గడువు ముగియనుండగా.. మరిన్నిరోజులు పొడిగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో టెస్టింగ్​ సెంటర్లను భారీగా ఏర్పాటు చేశారు. రోజూ 80వేల నుంచి లక్ష టెస్టులు చేస్తున్నారు. ఆక్సిజన్​ కొరతను ఢిల్లీ అధిగమించింది. పీఎం కేర్ ఫండ్స్ తో డీఆర్ డీవో ఆర్ఎంఎల్, ఎయిమ్స్ లో రెండు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నపాటి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి  ఇంటికే ఆక్సిజన్ ను అందిస్తామని కేజ్రీవాల్​ ప్రభుత్వం ప్రకటించింది.  18 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు వారికి మే 1 నుంచి వ్యాక్సిన్  వేస్తున్నారు. కరోనా కట్టడి కోసం లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్, మంత్రులు, అధికారులు రోజూ సమీక్షలు జరుపుతున్నారు. సెకండ్ వేవ్‌‌‌‌లో నిరుపయోగంగా ఉన్న కామన్ వెల్త్ గేమ్స్ భవనాలను కొవిడ్​ సెంటర్లుగా మార్చారు. రామ్ లీలా మైదానంలో కొత్తగా 500 బెడ్లను తీసుకువచ్చారు. డీఆర్ డీవో 500 బెడ్లను అందుబాటులోకి తెచ్చింది.  అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ల కొరతను, దోపిడీని నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆటోలనే అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లుగా మార్చింది. ప్రతి ఆటోకు ఆక్సిజన్ సిలిండర్ అమర్చింది. ఆటో డ్రైవర్లకు పీపీఈ కిట్లు సప్లై చేసింది. 
కర్నాటకలో స్పెషల్​ వార్​ రూమ్
కర్నాటకలో పేషెంట్లకు బెడ్లు దొరకలేదనే ఫిర్యాదు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బెంగుళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి డివిజన్‌‌‌‌‌‌‌‌కు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసింది. వీటిపై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ వార్ రూమ్‌‌‌‌‌‌‌‌ ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోని బెడ్లన్నింటినీ ఈ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లు మానిటర్ చేస్తున్నాయి.  అవసరమైన పేషెంట్లకు  ఇక్కడి నుంచే బెడ్లు కేటాయిస్తున్నారు. 
తమిళనాడులో 4 వేల ఆర్థిక సాయం
తమిళనాడులో కరోనా కారణంగా ప్రజలందరి ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని,  రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 4,000 ఆర్థిక సాయం అందిస్తామని కొత్త సీఎం స్టాలిన్​ ప్రకటించారు. తొలి విడత రూ. రెండు వేలు విడుదల చేస్తూ సంతకం చేశారు. ప్రైవేట్​ హాస్పిటళ్లలోనూ కరోనా ట్రీట్​మెంట్ ఫ్రీగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీట్​మెంట్​తోపాటు వ్యాక్సినేషన్​ను కూడా వేగవంతం చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.  
ఫస్ట్​ వేవ్​లోనే అలర్టయిన కేరళ
దేశంలో కరోనా మొదటి కేసు వెలుగు చూసింది కేరళలోనే. అలాంటి రాష్ట్రం వైరస్​ కట్టడిలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఫస్ట్​ వేవ్​లోనే అలర్టయి ప్రజారోగ్యంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ప్రత్యేక నిధులు కేటాయించింది. అప్పట్లోనే కొవిడ్ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మెడికల్​ ఆక్సిజన్​ ఎంత అవసరం? ఉన్న ఉత్పత్తి ప్లాంట్లు ఎన్ని అని టాస్క్​ఫోర్స్​ ఆరా తీసింది. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీటింగ్​తోపాటు కఠిన ఆంక్షలతోనే కరోనాను కట్టడి చేయొచ్చని ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇక్కడ 23 ఆక్సిజన్​ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. కరోనా పాజిటివ్​ కేసుల్లో దేశంలో కేరళ నాలుగో స్థానంలో ఉన్నా సీరియస్​ పేషెంట్లు చాలా తక్కువే. ప్రారంభ దశలోనే కొవిడ్​ బాధితులను గుర్తిస్తుండటంతో  ఆక్సిజన్, వెంటిలేటర్​ వరకు వెళ్లే వారు తగ్గిపోతున్నారు. కరోనా కట్టడి కోసం తాజాగా కేరళ ప్రభుత్వం లాక్​డౌన్​ను కూడా అమలు చేస్తోంది.

ఏపీలో కరోనాకు  ఫ్రీ ట్రీట్​మెంట్
ఏపీలో సర్కారు ఆసుపత్రులతో పాటు ప్రైవేట్​ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్లకు  ఫ్రీ ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. కరోనా ట్రీట్​మెంట్​ను  కేంద్ర సర్కార్ ‘ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ భారత్​’లో చేర్చింది. ఏపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ రెండు స్కీమ్‌‌‌‌‌‌‌‌ల కింద ఏపీ ప్రభుత్వం కరోనా పేషెంట్లకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో ఉచితంగా ట్రీట్​మెంట్​ అందిస్తోంది. ఆక్సిజన్​ కొరత లేకుండా రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి అన్ని హాస్పిటళ్లకు నిరాటంకంగా సప్లయ్​ చేయిస్తోంది. బెడ్ల కొరత లేకుండా ప్రైవేటు హాస్పిటళ్లను కట్టడి చేసింది. ప్రతి హాస్పిటల్​లో 10శాతం బెడ్లను పేదలకు కేటాయించి.. ఫ్రీ ట్రీట్​మెంట్​ ఇప్పిస్తోంది. ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న హాస్పిటళ్లలో 50 శాతం బెడ్లను ప్రభుత్వ కోటాగా పరిగణిస్తోంది.
మహారాష్ట్రలో హెల్ప్​ లైన్​, పోర్టల్​
మహారాష్ట్రలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తోంది. సెంట్రలైజ్‌‌‌‌‌‌‌‌డ్  బెడ్ అలకేషన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్​ తీసుకువచ్చింది.  టోల్ ఫ్రీ నంబర్లు కరోనా పేషెంట్లకు అండగా నిలుస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలు ఒకే చోటికి చేరేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అన్ని హాస్పిటళ్లలోని బెడ్లు, ఖాళీల ఆధారంగా.. పేషెంట్లకు బెడ్లు కేటాయిస్తోంది.  బార్డర్లలోని  చంద్రాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెడ్ అలకేషన్ కోసం ఒక పోర్టల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. బెడ్ కావాలనుకునే వాళ్లు పేరు, ఆధార్​ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలతో ఈ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తే వెంటనే సమాచారం అందుతుంది. రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు బ్లాక్ కాకుండా.. హాస్పిటళ్ల నుంచి వచ్చే ఇండెంట్​ ప్రకారం  ప్రభుత్వమే డైరెక్ట్​గా ఈ ఇంజక్షన్లను సప్లయ్​ చేస్తోంది. 
ఊపిరిపోస్తున్న ఒడిశా
ఎప్పుడూ కరువు రాష్ట్రాల జాబితాలో ఉండే ఒడిశా కరోనా కట్టడిలో ఫస్ట్​ ప్లేస్​లో ఉంటోంది. సెకండ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 22 నుంచి తెలంగాణ, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాకు  1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 67 ట్యాంకర్లలో సప్లయ్ చేసింది. కరోనా ఫస్ట్​ వేవ్​లో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు తిరిగిరాగా, వాళ్లందరినీ క్వారంటైన్ చేసింది. టెస్టులు పెంచింది. అప్పట్లో 8 లక్షల బెడ్లతో టెంపరరీ క్యాంపులను ఏర్పాటు చేసింది. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేసింది.  పేదలు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకుంది.  సెకండ్​ వేవ్​ తీవ్రతను ముందే పసిగట్టి ఏప్రిల్ 1న చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బార్డర్లను మూసేసింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు నెగెటివ్ రిపోర్ట్ కంపల్సరీ  చేసింది. ఎవరైనా నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వకపోతే బార్డర్ పాయింట్లలోనే క్వారంటైన్ చేస్తోంది. కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చును ఒడిశా ప్రభుత్వమే భరిస్తోంది.