నాలుగు రోజుల పని విధానం వైపు కంపెనీల మొగ్గు​

నాలుగు రోజుల పని విధానం వైపు కంపెనీల మొగ్గు​

న్యూయార్క్​: ‘వారంలో నాలుగు రోజుల’ పని విధానం సంపన్న దేశాల కంపెనీల్లో ఇప్పుడు హాట్​ టాపిక్. ఈ పద్ధతికి మారే వాటి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సదుపాయం కల్పించడం వల్ల ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెరుగుతుందని, అబ్సెంట్లు తగ్గుతాయని, టర్నోవర్​ పెరుగుతుందని స్టడీలు తేల్చాయి. నాలుగు రోజుల పని విధానాన్ని మొదట అమలు చేసిన 33 కంపెనీల్లో ఏ ఒక్కటీ పాత పద్ధతికి మారలేదు. ఆఫీసుకు బదులు ఇండ్ల నుంచి పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడుతున్నారని బాస్టన్​ కాలేజీకి చెందిన ఎకనమిస్ట్​ జూలియన్​ షోర్​ చెప్పారు. ‘‘ఇప్పుడు అమలవుతున్న పని విధానం 1938లో మొదలయింది. ప్రస్తుత పరిస్థితులకు ఇది అనువుగా లేదు. ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి మనం వారి పని విధానాన్ని మార్చాలి”అని అన్నారు.

న్యూజిలాండ్, అమెరికా, కెనడాలో చేసిన స్టడీల ద్వారా ఆసక్తికర విషయాలు తెలిశాయి. యూఎస్​, ఐర్లాండ్,  ఆస్ట్రేలియాలోని వ్యాపారాలు, సంస్థలకు చెందిన  969 మంది ఉద్యోగుల పనితీరును 10- నెలలు పరిశీలించారు. పనివారాలను జీతంలో మార్పు లేకుండా తగ్గించారు.  దీంతో వారి ప్రొడక్టివిటీ పెరిగింది.   ట్రయల్ సమయంలో సంస్థల ఆదాయం సుమారు 8శాతం పెరిగింది.  ఒక సంవత్సరం క్రితం కంటే ఇది 38 శాతం పెరిగింది.  నాలుగు-రోజుల షెడ్యూల్‌‌‌‌ బాగుందని ఉందని సంస్థలు అంగీకరించాయి.  ఉద్యోగి అబ్సెంటిజం నెలకు 0.6 రోజుల నుంచి 0.4 రోజులకు పడిపోయింది. రాజీనామాలు స్వల్పంగా తగ్గాయి. కొత్త నియామకాలు కొద్దిగా పెరిగాయి. కంపెనీలు మొత్తం ఈ విధానానికి  9 రేటింగ్ (10 పాయింట్లకు)​ ఇచ్చాయి. నాలుగు రోజుల పనివల్ల ఉద్యోగుల సామర్థ్యం పెరిగిందని కచ్చితంగా చెప్పవచ్చని  క్రౌడ్-ఫండింగ్ కంపెనీ కిక్‌‌స్టార్టర్‌‌  చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జోన్ లేలాండ్ అన్నారు. ఇది సెప్టెంబర్‌‌లో తన పైలట్‌‌ను పూర్తి చేసి, శాశ్వతంగా నాలుగు రోజుల షెడ్యూల్‌‌కు మారింది.  ఇందులో 100 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త విధానం వల్ల రాజీనామాలు కూడా తక్కువయ్యాయని అన్నారు. కిక్‌‌స్టార్టర్ ఉద్యోగులు కొత్త షెడ్యూల్‌‌ వల్ల రాజీనామాలను పక్కనబెట్టారని కంపెనీ వర్గాలు తెలిపాయి.  నాలుగు రోజుల పని విధానాన్ని అన్ని కంపెనీలూ అంగీకరించకపోవచ్చని, ఇది అసాధ్యమని భావించవచ్చని హెచ్​ఆర్​ ఎక్స్​పర్టులు అంటున్నారు.ఈ స్టడీలో  ఒక బలహీనత ఏమిటంటే, స్టడీలో పాల్గొనే అన్ని సంస్థలూ  అప్పటికే నాలుగు- రోజుల పనిపై ఇష్టంతో ఉన్నాయి. కొత్తగా ఈ విధానంపై అభిమానం పెంచుకోలేదు. వీటిలో పనిచేసే తొంభై ఏడు శాతం మంది నాలుగు రోజుల షెడ్యూల్‌‌ను కొనసాగించాలని కోరుకున్నారు.  తక్కువ పని వల్ల ఒత్తిడి, ఆందోళన,  అలసట తగ్గాయని చెప్పారు. వ్యాయామం వారానికి 24 నిమిషాలు పెరిగిందని అన్నారు. అదనపు సమయాన్ని ఇంకో ఉద్యోగం కోసం కాకుండా హాబీలు, ఇంటి పని, సెల్ఫ్​కేర్​ వంటి వాటి కోసం ఉపయోగించామని చెప్పారు. వారానికి నాలుగు రోజుల పనితోపాటు జీతాలూ పెంచాలని కోరారు. నలభై రెండు శాతం మంది తమకు కనీసం 26శాతం నుంచి 50శాతం జీతాల పెరుగుదల అవసరమని చెప్పారు, 13శాతం మంది తమకు 50శాతం కంటే ఎక్కువ హైక్​ కావాలని చెప్పారు.  13శాతం మంది ఎంత డబ్బు ఇచ్చినా వారానికి 40 గంటల పనివిధానానికి తిరిగిరామని  చెప్పారు.   

కొత్త విధానానికి 100 యూకే కంపెనీల గ్రీన్​ సిగ్నల్​

ఈ విధానంలో ఫలితాలు బాగున్నట్టు తేలడంతో100 యూకే కంపెనీలు తమ ఉద్యోగులకు జీతం తగ్గించకుండా శాశ్వతంగా నాలుగు రోజుల పని పద్ధతిని అమలు చేయడానికి ఓకే చెప్పాయి. ఈ ఏడాది జూన్​లో కొత్త పని విధానంపై ట్రయల్​ మొదలైంది. అప్పుడు 70 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. 2,600 మంది ఉద్యోగులతో కూడిన ఈ కంపెనీలు బ్రిటన్  పని విధానంలో పెద్ద మార్పుకు దారితీస్తాయని భావిస్తున్నాయి.