మరో వివాదంలో గూగుల్.. AI కోసం ఉద్యోగుల హెల్త్ డేటా ఇవ్వాలని ఒత్తిడి.. లేకుంటే..

మరో వివాదంలో గూగుల్.. AI కోసం ఉద్యోగుల హెల్త్ డేటా ఇవ్వాలని ఒత్తిడి.. లేకుంటే..

టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కంపెనీ ఉద్యోగుల విషయంలో వారి వ్యక్తిగత డేటా గోప్యత విషయంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గూగుల్ తన అమెరికా ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కొత్త మెలిక పెట్టడం వివాదానికి కారణమైంది. కంపెనీ తన ఉద్యోగులను నయ్యా (Nayya) అనే థర్డ్ పార్టీ ఏఐ ప్లాట్‌ఫారమ్ ద్వారా హెల్త్ క్లెయిమ్ డేటాను పంచుకోవాలని కోరింది. ఇందులో పాల్గొనని ఉద్యోగులు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాలకు అర్హులు కారని ప్రకటించటం పెద్ద చర్చకు దారి తీసింది. 

ఉద్యోగులు అంతర్గత ఫోరమ్‌లలో గోప్యతా ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ అంగీకారం లేకుండా  హెల్త్ డేటా థర్డ్ పార్టీకి ఇవ్వడం ఎలా న్యాయసమ్మతం? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక ఉద్యోగి గూగుల్ చేస్తున్న పనిని “డార్క్ ప్యాటర్న్”గా పేర్కొన్నారు. ఈ విమర్శల అనంతరం గూగుల్ కొన్ని సవరణలు చేసి స్పష్టతనిచ్చింది.

►ALSO READ | లక్షల కోట్లలో ప్రపంచ అప్పు : అమెరికా, ఇండియా, UK.. ఎవరికెంత అప్పుందో తెలుసా..!

విధానంలో ఉన్న పాత పదజాలం సంస్థ ఉద్దేశాన్ని సరిగ్గా ప్రతిబింబించలేదని గూగుల్ ప్రతినిధి కోర్టిని మెన్సిని అన్నారు. ఉద్యోగులు నయ్యా టూల్ వినియోగాన్ని పూర్తిగా స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చని.. ఇదే క్రమంలో దానిని తిరస్కరించినా వారి ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. గూగుల్ స్వయంగా ఉద్యోగుల వ్యక్తిగత వైద్య డేటాను యాక్సెస్ చేయదని, నయ్యా మాత్రమే HIPAA చట్టాల ప్రకారం డేటా భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని గూగుల్ చెబుతోంది. 

తాజా ఘటనతో పెద్ద టెక్ కంపెనీల్లో డేటా గోప్యత, పారదర్శకత, ఉద్యోగుల వ్యక్తిగత హక్కులపై కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. AI ఆధారిత వ్యవస్థలను వినియోగించే సంస్థలు ఇకపై సాంకేతిక సదుపాయాలతో పాటు నైతిక బాధ్యతలను కూడా సమానంగా ఫాలో అవ్వాల్సిన అవసరాన్ని గూగుల్ వివాదం స్పష్టంగా గుర్తుచేస్తోంది.