గాడితప్పిన ఆసుపత్రి నిర్వహణ!

గాడితప్పిన ఆసుపత్రి నిర్వహణ!
  • ఊసే లేని కొత్తగూడెంలోని జిల్లా జనరల్​హాస్పిటల్​ డెవలప్ మెంట్​ కమిటీ ఏర్పాటు 
  • ఇష్టారాజ్యంగా ఔట్​సోర్సింగ్​ నియామకాలు, నిధుల దుర్వినియోగం!


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలకు కార్పొరేట్​స్థాయి వైద్య సేవలందించేందుకు జిల్లాలో మెడికల్​కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన భద్రాద్రొకొత్తగూడెం జిల్లా గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​లో పాలన గాడి తప్పింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, హాస్పిటల్​ డెవలప్​మెంట్​ కమిటీ లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలున్నాయి.
 
ఇదీ పరిస్థితి..

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్​హాస్పిటల్​ వైద్య విధాన పరిషత్​ పరిధిలో ఉన్న టైంలో హాస్పిటల్​ డెవలప్​మెంట్​కమిటీ ఉండేది. ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు ఆఫీసర్లతో ఉన్న ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి హాస్పిటల్​లోని అన్ని సమస్యలపై రివ్యూ చేసేది. 2021లో హాస్పిటల్​వైద్య విధాన పరిషత్​ నుంచి డీఎంఈ పరిధిలోకి పోయింది. మెడికల్​ కాలేజ్​కు అనుబంధంగా జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​ జిల్లా గవర్నమెంట్​సర్వజన హాస్పిటల్​గా ఏర్పడింది. 

దీనికి అనుబంధంగా రామవరంలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2022 నుంచి జిల్లా సార్వజనిక హాస్పిటల్​ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ హాస్పిటల్​ డెవలప్​మెంట్ కమిటీ ఏర్పాటు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్​ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీలో జిల్లా పరిషత్​ చైర్మన్, హాస్పిటల్​పరిధిలోకి వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలు, మున్సిపల్​ చైర్మన్​, ఎంపీలతో పాటు పలు స్థాయిలోని ప్రజా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థల ప్రతినిధులు మెంబర్లుగా ఉంటారు. 

ఎక్సరే గదికి తాళం.. 

హాస్పిటల్​లో నాణ్యమైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. హాస్పిటల్​లో డాక్టర్లు గ్రూపులుగా ఏర్పడ్డారు. బయోమెట్రిక్​ ఉన్నప్పటికీ తమకిష్టమొచ్చినప్పుడు వచ్చిపోవడం కామన్​గా మారింది. రోగులకు మెనూ ప్రకారంగా ఫుడ్​ అందడం లేదనే ఆరోపణలున్నాయి. హాస్పిటల్​లో కీలకమైన ఎక్స్​రే ప్లాంట్, సిటీ స్కాన్​ గదికి తాళం వేశారు. 

రొమ్ము క్యాన్సర్​ వ్యాధిని నిర్ధారించే మెమోగ్రామ్​ టెస్ట్​ సరిగా నడడం లేదు. హాస్పిటల్​ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోంది. హాస్పిటల్​లోని బ్లడ్​ బ్యాంక్​కు లైసెన్స్​రెన్యువల్​ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పర్మిషన్​ రాలేదు. పర్యవేక్షించే వారు లేరు. ఇప్పటికైనా హాస్పిటల్​ డెవలప్​మెంట్​కమిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  

పెద్ద మొత్తంలో చేతులు మారిన డబ్బు!

హాస్పిటల్​లో ఔట్​ సోర్సింగ్​పద్ధతిలో జరిగిన పలు నియామకాల్లో  పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. దాదాపు 218కి పైగా జరిగిన నియామకాల్లో ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ . 2లక్షల వరకు వసూలు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలోనే మెడికల్​ కాలేజ్​ ప్రిన్సిపల్​కు, సూపరింటెండెంట్​కు మధ్య విభేదాలు మొదలయ్యాయనే ప్రచారం ఉంది. 

Also Read: ఇవాళ పాలమూరు న్యాయ్ యాత్ర ముగింపు సభ

చివరకు హాస్పిటల్ సూపరింటెండెంట్​గా ఉన్న కుమారస్వామిని అధికారులు ప్రభుత్వానికి సరెండర్​ చేశారు. పీఎఫ్, ఈఎస్​ఐ చెల్లింపుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామిని సరెండర్​ చేసి దాదాపు నెల రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి సూపరింటెండెంట్​ను నియమించలేదు. మెడికల్​కాలేజ్​ప్రిన్సిపల్​లక్ష్మణ్​రావు ప్రస్తుతం ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు.