ఇవాళ పాలమూరు న్యాయ్ యాత్ర ముగింపు సభ

ఇవాళ పాలమూరు న్యాయ్ యాత్ర ముగింపు సభ
  • హాజరుకానున్న సీఎం రేవంత్​రెడ్డి

పాలమూరు, వెలుగు : సీఎం హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి మొదటిసారి తన సొంత జిల్లా పాలమూరుకు బుధవారం వస్తున్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి జనవరి 30న ప్రారంభించిన ‘పాలమూరు న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా ‘ప్రజా దీవెన’ సభను నిర్వహిస్తున్నారు. సభకు సీఎం చీఫ్ గెస్ట్​గా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎంవీఎస్  కాలేజీ గ్రౌండ్​లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. 

సీఎం రాక సందర్భంగా అధికారులు, పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్  నుంచి హెలికాప్టర్ లో స్టేడియం గ్రౌండ్​కు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజ నర్సింహా, ఎక్సైజ్  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఎమ్మెల్సీ క్యాండిడేట్​ను ప్రకటించే చాన్స్..

స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఇటీవల నోటిఫికేషన్  విడుదలైంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్  పార్టీ నుంచి క్యాండిడేట్​ను ప్రకటించలేదు. ఈ సభలో సీఎం ఎమ్మెల్సీ క్యాండిడేట్​ను ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే మన్నె జీవన్ రెడ్డిని హై కమాండ్​ ఫైనల్  చేసినట్లు ప్రచారం జరుగుతున్నా, బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్  ఎన్పీ వెంకటేశ్ కూడా పైరవీ చేస్తున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న లీడర్లు తమకు కూడా అవకాశం ఇవ్వాలని హైకమాండ్​కు విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది.

Also Read: జోష్​ నింపిన మోదీ సభ.. బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం

సభకు సక్సెస్​ చేద్దాం..

ఎంవీఎస్  గ్రౌండ్​లో బుధవారం జరిగే సీఎం సభను సక్సెస్​ చేయాలని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​రెడ్డి కోరారు. పార్టీ ఆఫీస్​లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పెండింగ్  ప్రాజెక్టుల పూర్తి, ఇంజనీరింగ్, లా కాలేజీల ప్రకటన చేస్తారని చెప్పారు. సీఎం తన సొంత జిల్లా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్నారు. అనంతరం సభ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. లీడర్లు ఎస్ఏ వినోద్ కుమార్, సీజే బెహనర్, లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రి, అవేజ్, సాయిబాబా పాల్గొన్నారు.