
- రూ.1.84 లక్షల కోట్లు తిరిగిచ్చేందుకు ‘ఆప్కీ పూంజి, ఆప్కా అధికార్’ కార్యక్రమం
- ప్రారంభించిన నిర్మలా సీతారామన్
గాంధీనగర్: బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న రూ.1.84 లక్షల డిపాజిట్లను అర్హులైన కస్టమర్లకు తిరిగి ఇచ్చేందుకు ‘ఆప్కీ పూంజి, ఆప్కా అధికార్’ (మీ డబ్బు, మీ హక్కు) ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ ప్రచారం మూడు నెలల పాటు కొనసాగుతుంది.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. “ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో, ఆర్‌బీఐలో లేదా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) లో ఉన్నాయి. సరైన డాక్యుమెంట్లతో వస్తే అర్హులైన వారు తమ డిపాజిట్లను తిరిగి పొందొచ్చు. మీ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయి. ప్రభుత్వం వీటిని సంరక్షిస్తోంది” అని నిర్మల అన్నారు. డిపాజిట్లు, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, షేర్ల రూపంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని, దీన్ని గుర్తించి యజమానులకు అందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
“బ్యాంకుల నుంచి డిపాజిట్లు ఆర్‌బీఐకి, షేర్లు సెబీ నుంచి ఐఈపీఎఫ్‌కి బదిలీ అవుతాయి” అని వివరించారు. కాగా, ఆర్‌బీఐ ప్రారంభించిన యూడీజీఏఎం పోర్టల్ ద్వారా ప్రజలు తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి క్లెయిమ్ చేసుకోవచ్చు.