మధ్యాహ్నం చదువులు ఇంకెన్నేండ్లు?

మధ్యాహ్నం చదువులు ఇంకెన్నేండ్లు?
  • 15 ఏండ్లుగా ఒకే బిల్డింగ్​లో 
  • ఇబ్రహీంపట్నం జూనియర్, డిగ్రీ కాలేజీలు
  • పొద్దున ఇంటర్.. మధ్యాహ్నం డిగ్రీ క్లాసులు
  • 2016లో 5 ఎకరాల్లో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన
  • నేటికీ అందుబాటులోకి రాని బిల్డింగ్

ఇబ్రహీంపట్నం, వెలుగు:
 సరైన సదుపాయాలు లేక రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు అధ్వానంగా మారాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నడుస్తుండగా, కొన్నింటికి మాత్రమే సొంత బిల్డింగ్‌లు ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న బిల్డింగులను పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీ కోసం 2016లో స్థానిక వినోభానగర్‌‌లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. అదే ఏడాది డిసెంబర్ 28న రూ.2కోట్ల25లక్షల అంచనాతో మంత్రి కేటీఆర్​పనులకు శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ సివిల్ పనులను పూర్తిచేసి, సమయానికి బిల్లులు రావడం లేదని, తనకు గిట్టుబాటు కాదని మధ్యలోనే వదిలేశాడు. దీంతో నేటికీ బిల్డింగ్ ​అందుబాటులోకి రాలేదు.

కాగా 2008లో స్థానిక జూనియర్​ కాలేజీ బిల్డింగ్​లో మొదలైన డిగ్రీ కాలేజీ నేటికీ అందులోనే కొనసాగుతోంది. సరిపడా క్లాస్​రూమ్స్​​ లేక 15 ఏండ్లుగా వంతుల వారీగా జూనియర్, డిగ్రీ కాలేజీలను నడిపిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జూనియర్ ​కాలేజీ స్టూడెంట్లకు, ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిగ్రీ కాలేజీ స్టూడెంట్లకు క్లాసులు నిర్వహిస్తున్నారు.

450 మంది ఇంటర్ ​స్టూడెంట్లు ఉండగా, డిగ్రీ కాలేజీలో 738 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. విశాలమైన క్లాస్​రూమ్స్, ల్యాబ్స్‌, ప్లే గ్రౌండ్ తోపాటు అన్ని వసతులు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఏండ్లుగా ఎలాంటి సదుపాయాలు లేకుండా ఇబ్రహీంపట్నంలో డిగ్రీ కాలేజీని నడిపించడంపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ తోపాటు డైరీ సైన్స్, క్రాప్ ​ప్రొడక్షన్ ​వంటి కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నా షిఫ్టుల వారీగా కొనసాగుతున్న కాలేజీలో చేరేందుకు స్టూడెంట్లు వెనకడుగు వేస్తున్నారు. సాయంత్రం బస్సులు ఉండవనే భయంతో స్టూడెంట్లు 4 గంటల నుంచే క్లాసులు వినకుండా వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని డిగ్రీ కాలేజీ బిల్డింగ్​ను అందుబాటులోకి తీసుకురావాలని స్టూడెంట్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

వందల మందికి ఒకటే బాత్రూం

మా కాలేజీలో సరిపడా క్లాస్​రూమ్స్​ లేవు. వందల మందికి ఒకటే బాత్రూం ఉంది. నీళ్ల సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఉదయం జూనియర్, మధ్యాహ్నం నుంచి డిగ్రీ క్లాసులు నిర్వహిస్తున్నారు. సొంత బిల్డింగ్‌ ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండవు. 
–  కత్తుల భాను, బీఏ స్టూడెంట్, ఇబ్రహీంపట్నం

ఐదు దాటితే బస్సులు ఉండవ్
మాది మారుమూల గ్రామం. సాయంత్రం 5 గంటలు దాటితే ఇంటికి వెళ్లాలంటే బస్సులు ఉండవు. అందుకే క్లాసులు ఉన్నా.. సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్లిపోతాను. ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కాలేజీ నిర్వహిస్తే ఇబ్బంది ఉండదు. డిగ్రీ కాలేజీ బిల్డిం
గ్​ను వెంటనే పూర్తి చేయాలి.

– జలంధర్, బీఎస్సీ డెయిరీ సైన్స్ స్టూడెంట్